శ్రీలంకలో ఈస్టర్ పర్వదినాన ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమాన్ని ఇస్లామిక్ స్టేట్ అధినేత 'అబూ బకర్ అల్ బాగ్దీదీ' మెచ్చుకున్నాడు. ఐదేళ్లుగా చనిపోయాడనకుంటున్న 'బకర్' ఓ వీడియో సందేశం ద్వారా ప్రపంచం ముందుకొచ్చాడు.
దాదాపు 18 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో... చుట్టూ కూర్చున్న కొంతమందికి బకర్ ఏదో చెబుతున్నాడు. అంతేకాకుండా శ్రీలంక దాడులపై ఓ ప్రత్యేక ఆడియా టేప్‌ను విడుదల చేశాడు. సిరియా బాగౌజ్లోని ఐసిస్ స్థావరాన్ని కూల్చినందుకు ప్రతీకారంగానే శ్రీలంకలో ఆత్మాహుతి దాడులు చేసినట్లు తెలిపాడు.
సమూలంగా అంతమొందిస్తాం
ఐసిస్ అధినేత అబూ బకర్ అల్ బాగ్దీదీ వీడియో విడుదల చేసిన నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఇస్లామిక్ స్టేట్ కార్యకలాపాల జాడను గుర్తించి సమూలంగా నాశనం చేస్తామని అగ్రరాజ్యం ప్రకటించింది. బాగ్దీద్ వీడియోపై సమీక్ష నిర్వహించి.. అది నిజమైనదో కాదో ధ్రువీకరించుకుంటామని స్పష్టం చేసింది.
చివరగా 2014లో
2014 జులైలో చివరిసారిగా ఓ వీడియో ద్వారా ప్రపంచానికి కనిపించిన అబూ బకర్, 2015 మార్చి 18న సిరియా సరిహద్దు రాష్ట్రం నినెవే వద్ద తీవ్రంగా గాయపడ్డట్లు వార్తలు వెలువడ్డాయి. అతడు చనిపోయినట్లు వచ్చిన వార్తల్ని అమెరికా, రష్యా రెండూ ధ్రువీకరించాయి.