మానవాళి మనుగడ సాగించాలంటే వైరస్‌లపై పరిశోధనలు చాలా ముఖ్యం. స్పానిష్ ఫ్లూ, కరోనా వైరస్ వంటివి మరోసారి భారీగా ప్రాణాల్ని బలిగొనకుండా టీకాలు, ఔషధాల్ని సిద్ధం చేసుకోవాలంటే వైరస్‌లలో చోటు చేసుకొనే మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ ఉండాలి. అవసరమైతే శాస్త్రవేత్తలే వాటిల్లో మార్పులుచేసి మరింత ప్రమాదకరంగా మారుస్తుంటారు. అలాంటి వాటిపై వివిధ రకాల పరీక్షల నిర్వహణకు ప్రపంచ వ్యాప్తంగా వైరాలజీ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. వీటి స్థాయులను బయోసేఫ్టీ లెవెల్‌లో చూస్తారు. వీటి నుంచి వచ్చే వ్యర్థాలను బయటకు పోనీయరు. శాస్త్రవేత్తలు ప్రయోగాల అనంతరం స్నానాలకు వాడిన నీటిని కూడా రసాయన శుద్ధిచేస్తారు. మనిషిలో ప్రవేశించడానికి అవకాశమున్న ప్రతిభాగాన్నీ వైరస్‌లు ఉపయోగించుకుంటాయి కాబట్టి.. అవి ఎట్టి పరిస్థితుల్లో లీకవకుండా రక్షణ ప్రమాణాలు పాటించాలి. బీఎస్‌ఎల్4 ప్రయోగశాలల్లో ఇలాంటి ప్రమాణాలే ఉంటాయి. చైనాలోని వుహాన్‌లో విమర్శలు ఎదుర్కొంటున్న పీ4ల్యాబ్ కూడా ఇలాంటిదే.
![Is any virus spread from china laboratories in past? lets we discuss](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7063507_fg.jpg)
పరిశోధకురాలి ఏమరుపాటుతో
'లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్'లో పనిచేసే ఒక యువతి 1972లో ఎటువంటి రక్షణ లేకుండా మశూచి వైరస్‌ను గుడ్లపై కృత్రిమంగా పెంచే ప్రక్రియను ఒక టేబుల్‌పై నిర్వహించింది. ఆ తర్వాత అలాగే బయటికి వెళ్లిపోయింది. వైరస్ అంటుకున్న కారణంగా ఆమె అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరింది. ఆమెను ఐసోలేషన్‌లో ఉంచే సమయానికి మరో ఇద్దరు రోగులకు.. నర్సుకు ఇది సోకింది. వీరిలో ఇద్దరు మృతి చెందారు.
![Is any virus spread from china laboratories in past? lets we discuss](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7063507_op.jpg)
వెంటిలేటర్ నుంచి బయటకొచ్చి..
'బర్మింగ్‌హోమ్ మెడికల్ స్కూల్' నుంచి 1978లో మశూచి వైరస్ బయటికొచ్చింది. ఈ స్కూల్ పక్క భవనంలో పనిచేస్తున్న జానెట్ పార్కర్ అనే మెడికల్ ఫొటోగ్రాఫర్ ఒంటిపై పొక్కులు వచ్చాయి. దీనిని తొలుత వైద్యులు ఆటలమ్మగా భావించారు. కానీ, తీవ్రత పెరగడంతో పరీక్షలు నిర్వహించి మశూచిగా తేల్చారు. ఆ తర్వాత ఆమె మృతి చెందింది. వైరస్ ఆమె తల్లికి సోకినా తను ప్రాణాలతో బయటపడింది. మెడికల్‌లో స్కూల్లో మశూచిపై పరిశోధనలు చేస్తున్నవారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వెంటిలేషన్ నుంచి అది బయటకు వచ్చినట్లు భావించారు. అప్పుడు మొత్తం 300 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. 1966లో కూడా అక్కడ ఒకసారి మశూచి ప్రబలింది. దీనిని కూడా ఆ తర్వాత లీకేజీగానే గుర్తించారు. ఇది 72 మందికి సోకినా ప్రాణనష్టం జరగలేదు.
![Is any virus spread from china laboratories in past? lets we discuss](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7063507_bn.jpg)
గాలికుంటు వ్యాధి వ్యాప్తి ఇలా..
గాలికుంటు వ్యాధి అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. 2007లో బ్రిటన్‌లోని పిర్‌బ్రైట్ వద్ద ఉన్న ప్రయోగశాలకు 4 కిలోమీటర్ల దూరంలో ఈ వ్యాధి వ్యాపించింది. దీని జన్యుక్రమాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు 1967లో వెలుగుచూసిన వైరస్ రకంగా గుర్తించారు. పిర్‌బ్రైట్ వద్ద దీనికి టీకాలు చేసే కేంద్రం ఉంది. అక్కడ నిర్మాణ పనుల్లో ఉపయోగించే ట్రక్కులు గాలికుంటు వ్యాధి వైరస్ ఉన్న బురదను తరలించడంతో దాని ద్వారా మరోసారి జంతువుల్లో వ్యాపించింది.
![Is any virus spread from china laboratories in past? lets we discuss](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7063507_jk.jpg)
వ్యాక్సిన్లలో బతికిన వైరస్..!
అమెరికా ఖండంలో వీఈఈ(వెనెజువెలా ఈక్వినైన్ ఎన్‌కెఫలటీస్) వ్యాధి 1930-70 మధ్య పలుమార్లు ప్రబలింది. ఇది జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధి. 1938లో ఈ వైరస్‌ను బంధించి జంతువులకు టీకాలను అభివృద్ధిచేశారు. పొరపాటున ఈ టీకాల్లోని కొన్ని బ్యాచుల్లో వైరస్ పూర్తిగా అచేతనం కాలేదు. దీంతో టీకాలు వేసినా.. 1970 వరకు చాలాసార్లు ఈ వ్యాధి ప్రబలింది. ఆ తర్వాత లోపం గుర్తించి ఆ వైరస్‌ను వాడటం మానేశారు. దీంతో వ్యాప్తి ఆగిపోయింది. కానీ, 1995లో వెనెజువెలా, కొలంబియాలో ఈ వ్యాధి మనుషుల్లో విజృంభించింది. 1963లో శాస్త్రవేత్తలు సేకరించిన వైరస్ జన్యువులను అది పోలి ఉంది. దీనిని టీకాలకు కూడా వాడలేదు. ఈ నేపథ్యంలో ల్యాబ్ నుంచి తప్పించుకొందని తేల్చారు. పూర్తిగా అచేతనం చేయని వైరస్‌ను ల్యాబ్‌లోని ఒక బల్లపై ఉంచడం వల్ల లీకైనట్లు అనుమానిస్తున్నారు.
ప్రమాదాలు ఇలా..
వైరాలజీ ల్యాబ్‌లలో పరిశోధనలు చేసేటప్పుడు అనుకోకుండా వైరస్‌లు వ్యాపిస్తుంటాయి. మానవ తప్పిదాలు, సాఫ్ట్‌వేర్ లోపాలు, నిర్వహణ సమస్యలు, పరికరాలు పనిచేయకపోవడం వంటి సందర్భాల్లో వైరస్ బయటకు రావచ్చు. 2005-12 మధ్యలో ఇలాంటి ఘటనలు 1059 వరకు అమెరికా సీడీసీ దృష్టికి వచ్చాయి. కొన్నిసార్లు రక్షణ పరికరాలు మోరాయించడంతో శాస్త్రవేత్తల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. ముఖ్యంగా స్టెరిలైజింగ్ పరికరాలు, రసాయన స్నానాలు చేసే షవర్లలో ఒత్తిడి తగ్గిపోవడం వంటివి కూడా చోటు చేసుకొంటున్నాయి. 2015-17 మధ్యలో ఇలాంటివి దాదాపు 40ఘటనలు నమోదయ్యాయి.
2014లో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిన్‌స్ట్రేషన్ కార్యాలయాన్ని బెథ్సెడా నుంచి వైట్ ఓక్ ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేస్తుండగా మశూచి వైరస్ వైల్ ఉన్న పెట్టెను ల్యాబ్‌లో నిర్లక్ష్యంగా ఉంచినట్లు తేలింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఇది సోకలేదు. 2008లో మరోసారి అమెరికా ల్యాబ్‌లో స్టెరిలైజింగ్ పరికరం పనిచేయకపోవడంతో అక్కడి ఉద్యోగి గుర్తుతెలియని వైరస్ బారిన పడ్డాడు. 2009లో బర్డ్‌ఫ్లూ వైరస్‌పై పరిశోధనలు చేసేవారు ల్యాబ్ బయటకు వచ్చే ముందు రక్షణ సూట్‌తో సహా రసాయన స్నానం చేయాలి. కానీ, షవర్ పనిచేయకపోవడంతో ఓ పరిశోధకురాలు ఆ సూట్ తొలగించి మరోచోటుకు వెళ్లి రసాయన స్నానం చేసింది. ఈ లోపు వైరస్ లీకైయ్యే ప్రమాదకర పరిస్థితి చోటు చేసుకొంది.
![Is any virus spread from china laboratories in past? lets we discuss](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7063507_rt.jpg)
అమెరికాలో కరోనా కిట్ల ఆలస్యానికి కారణం అదే..
అమెరికాలో కరోనా వైరస్ వ్యాపిస్తుండటతో వేగంగా టెస్టింగ్ కిట్లు తయారు చేయాలని సీడీసీ భావించింది. దీంతో అట్లాంటాలోని సీడీసీ ల్యాబ్ వీటి అభివృద్ధిని మొదలుపెట్టింది. కృత్రిమ వైరస్‌కు సమీపంలోనే ఈ పనిచేపట్టింది. ఈ క్రమంలో ఆ వైరస్ ఈ కిట్లలో వాడిన ఒక పదార్థానికి సోకింది. దీంతో శుద్ధిచేసిన నీటిని ఆ కిట్లతో పరీక్షించినా కరోనా పాజిటివ్‌గా చూపడం మొదలుపెట్టాయి. అప్పటికే ఆ కిట్లను దేశంలోని వివిధ ప్రదేశాలకు పంపారు. లోపాన్ని కనుగొని సరిచేసే సరికి బాగా ఆలస్యం అయింది.
![Is any virus spread from china laboratories in past? lets we discuss](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7063507_we.jpg)
చైనా చుట్టుపక్కల
సార్స్‌కు కారణమైన కరోనా వైరస్‌లు ల్యాబ్ నుంచి పలుమార్లు బయటకు వచ్చాయి. ఇవి కొన్ని సందర్భాల్లో మనషుల ప్రాణాలను బలిగొన్నాయి. చైనాలోనే ఇటువంటివి నాలుగుసార్లు చోటు చేసుకొన్నాయి. సార్స్ వ్యాధి సోకిన వారిలో ‘సూపర్ స్ప్రెడర్’ రోగులు ఎక్కువ. అదృష్టవశాత్తు ఈ లీకుల్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోలేదు. 2003 తర్వాత ‘సార్స్ కోవ్ 1’ సహజంగా మనుషులకు సోకలేదు.
- 2003 ఆగస్టులో సింగపూర్‌లోని ‘నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్’ విద్యార్థికి సార్స్ వైరస్ సోకింది. అతన్నుంచి మరెవరికీ ఇది అంటలేదు. దీంతో సార్స్ వైరస్ నిర్వహణ ప్రమాణాలను డబ్ల్యూహెచ్‌వో మార్చేసింది.
- 2003 డిసెంబర్‌లో తైవాన్‌లోని తైపి నగరంలో పరిశోధకుడుకి సార్స్ సోకింది. అంతకు 2వారాల ముందు అక్కడి సైనిక ఆసుపత్రి ప్రయోగశాలలో ఎటువంటి రక్షణ కవచాల్లేకుండా బయోవ్యర్థాలను తొలగించాడు. అప్పట్లో స్వల్పలక్షణాలు కనిపించినా.. సింగపూర్‌లో ఒక సదస్సులో పాల్గొని వచ్చాక వ్యాధి లక్షణాలు పూర్తిగా బయటపడ్డాయి. దీంతో 70 మందిని క్వారంటైన్‌కు తరలించి చికిత్స చేశారు.
- 2004 ఏప్రిల్ 22 నుంచి 29 మధ్యలో చైనాలోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’లో ఇద్దరు విద్యార్థులకు సార్స్ సోకింది. వీరి నుంచి మరో ఏడుగురికి వ్యాపించింది. తొమ్మిది మందిలో ఒకరు చనిపోయారు. ఆ తర్వాత అదే ల్యాబ్‌లో మరో మూడుసార్లు వైరస్ లీకైనట్లు ఆంగ్లపత్రిక 'ఎక్స్‌ప్రెస్.యూకే' పేర్కొంది.చైనా చుట్టుపక్కల