ఇరాన్ గగనతలంలోకి అక్రమంగా చొరబడిన అమెరికా నిఘా డ్రోన్‌ను కూల్చివేశామని ఇరాన్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ జావేద్ జారిఫ్ గురువారం ప్రకటించారు.
అమెరికా నిఘా డ్రోన్‌ను బుధవారం 4.05 గంటలకు కోహ్-ఇ-ముబారక్ సమీపంలో కూల్చివేశామని మొహమ్మద్ తెలిపారు. దీని శకలాలను తమ ప్రాదేశిక జలాల్లోనే స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. ఇందుకు సాక్ష్యంగా ఇరాన్ సైన్యం ఓ వీడియోను విడుదల చేసింది.
అమెరికా అక్రమంగా తమ భూభాగంలోకి నిఘా డ్రోన్‌ను పంపిందని ఇరాన్ ఆరోపించింది. ఈ విషయంపై ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు ఆ దేశ విదేశాంగ మంత్రి.
అమెరికా ఖండన
అమెరికా మాత్రం ఇరాన్ వాదనలను తప్పుబడుతోంది. అంతర్జాతీయ గగనతలంలో ఉన్న తమ నిఘా డ్రోన్‌ను ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఇరాన్ సైన్యం కూల్చివేసిందని ప్రత్యారోపణలు చేసింది. ఇందుకు సాక్ష్యంగా అమెరికా రక్షణ కేంద్రం పెంటగాన్ ఓ గ్రాఫిక్ మ్యాప్‌ను విడుదల చేసింది.
ప్రపంచంలో 35 శాతం ముడిచమురు రవాణా అయ్యే వ్యూహాత్మక హార్మోజ్ జలసంధి వద్ద అమెరికా నిఘా డ్రోన్ ఉన్నట్లు ఆ మ్యాప్ సూచిస్తోంది.
ఇదీ నేపథ్యం
మధ్యప్రాచ్యంలో రెండు చమురు ట్యాంకర్లపై దాడులు జరిగాయి. వీటిని ఇరాన్ చేయించిందని ఆమెరికా ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను ఇరాన్ తోసిపుచ్చింది. ఈ కారణంగా ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి: 18 వేల అడుగుల ఎత్తులో జవాన్ల యోగా