కరోనా ఉద్ధృతితో ఇండోనేసియా.. తీవ్రమైన ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటోంది. కేసుల పెరుగుదలతో ఆసుపత్రులకు జనం తాకిడి అధికమైంది. జావా ద్వీపంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాణ వాయువు సరఫరా నిలిచిపోవడం వల్ల.. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు విడిచారు.
యోగ్యకర్టా నగరంలోని డా. సర్జిటో జనరల్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత వల్ల శనివారం కనీసం 33 మంది కరోనా రోగులు మరణించారు. వారాంతంలో సరఫరా ఆలస్యం కావడమే ఇందుకు కారణమని ఆసుపత్రి అధికార ప్రతినిధి బాను హెర్మావాన్ తెలిపారు.
శనివారం నుంచి ఆసుపత్రిలో 63 మంది మరణిస్తే.. అందులో 33 మంది ఆక్సిజన్ కొరత కారణంగానే ప్రాణాలు కోల్పోయినట్లు హెర్మావాన్ పేర్కొన్నారు. ఆక్సిజన్ కొరత నేపథ్యంలో.. సహాయం చేయాలని అధికార యంత్రాంగాన్ని కోరినట్లు హెర్మావాన్ తెలిపారు. ఇతర ఆసుపత్రుల నుంచైనా ప్రాణవాయువును అందించాలని కోరినా ప్రయోజనం లేకపోయిందని అన్నారు. చివరకు 15 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ అందుబాటులోకి రాగా.. ఆదివారం ఉదయం 4.45 గంటలకు రోగులకు సరఫరా పునరుద్ధరించినట్లు వెల్లడించారు.
కరోనా కేసుల పెరుగుదలతో ఇండోనేసియా ఆరోగ్య వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ఇండోనేసియాలో జావా అతిపెద్ద ద్వీపం. అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతం. కేసుల పెరుగుదలతో ఆసుపత్రుల్లో బెడ్లు లేక ప్లాస్టిక్ టెంట్లలోనే రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రుల్లో అడ్మిషన్ దొరకడానికి జనం రోజుల వేచి ఉంటున్నారు.
ఇదీ చదవండి: