షార్జా నుంచి లఖ్‌నవూ వెళ్తున్న ఇండిగో విమానాన్ని పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అందులోని ఓ ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితి విషమించిన కారణంగా కరాచీకి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. అయితే.. సదరు ప్రయాణికుడు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు.
ఇండిగో 6ఈ1412 అనే విమానంలోని 67 ఏళ్ల హిబీర్ ఉర్ రెహ్మాన్ అనే వ్యక్తి అస్వస్థతకు గురైన కారణంగా కరాచీలో ల్యాండ్ చేసేందుకు మానవతా దృక్పథంతో అనుమతులు ఇచ్చినట్లు పాకిస్థాన్ పౌర విమానయాన అధికారి ఒకరు తెలిపారు. మంగళవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో పాక్ గగనతలంలోకి ప్రవేశించిన క్రమంలో అభ్యర్థన అందిందని, 5 గంటలకు ల్యాండింగ్‌కు అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. అన్ని రకాల లాంఛనాలు పూర్తి చేసుకున్న తర్వాత ఉదయం 8.36 గంటలకు అహ్మదాబాద్ బయలు దేరినట్లు తెలిపారు.
" మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడిన ప్రయాణికుడిని కాపాడుకోలేకపోయాం. విమానాశ్రయ వైద్య బృందం అతను మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యాం. అతని కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి. " అని ఇండిగో ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇదీ చూడండి: ఇండిగో విమానానికి తప్పిన పెనుముప్పు