విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్డీఐ)విధానంలో భారత్ చేసిన కీలక మార్పులపై అక్కసు వెళ్లగక్కింది చైనా. భారత్ తాజాగా అమలు చేస్తున్న నిబంధనలు ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) మార్గదర్శకాలను ఉల్లంఘించేలా ఉన్నాయని పేర్కొంది.
డబ్ల్యూటీఓ నిబంధన అయిన స్వేచ్ఛా వాణిజ్య సూత్రానికి విరుద్ధమైన నియమావళిని భారత్ అనుసరిస్తోందని విమర్శించింది చైనా. భారత్లోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి ఈమేరకు ప్రకటన విడుదల చేశారు.
"డబ్ల్యూటీఓ నిర్దేశించిన 'పక్షపాతం లేని వైఖరి' నిబంధనను భారత్ అనుసరిస్తున్న ఎఫ్డీఐ విధానం ఉల్లంఘిస్తోంది. సరళీకృత, సులభతర వాణిజ్య, పెట్టుబడి విధానాలకు భారత విధానం వ్యతిరేకం."
-జి రాంగ్, చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి.
ఇదీ నేపథ్యం..
కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్న వేళ అవకాశవాదంతో ఇతర దేశాలు భారత సంస్థల్లో వాటాలు చేజిక్కించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను మరింత కఠినతరం చేసింది. భారత్‌తో సరిహద్దులు పంచుకునే దేశాలు, అక్కడి వ్యక్తులు, వ్యాపార సంస్థలు.. దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేసింది. దీనిపైనే చైనా తన అక్కసు వెళ్లగక్కింది.
ఇదీ చూడండి: ద్రవ్యలభ్యత కోసం అసాధారణ విధానాలే శరణ్యమా?