చైనా ఎప్పుడు ప్రయాణ ఆంక్షలు సడలిస్తుందో తెలియక.. ఆ దేశంలో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది విద్యార్థులంతా స్వదేశానికి వచ్చారు. అప్పటి నుంచి ఆన్‌లైన్‌లోనే తమ విద్యను కొనసాగిస్తున్నారు. చైనాలో చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. అన్లైన్ తరగతులు జరుగుతున్నా.. ప్రాక్టికల్స్ లేకపోవడంతో వీరంతా ఆందోళనకు గురవుతున్నారు. దీనికితోడు చైనాకు చెందిన చాలా యాప్‌లను భారత్ నిషేధించింది. దీంతో వర్చువల్ ప్రయివేట్ నెట్‌వర్క్ (వీపీఎన్) ఇన్‌స్టాల్ చేసుకొని విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులు కొనసాగిస్తున్నారు.
2019 డేటా ప్రకారం.. దాదాపు 23 వేల మంది విద్యార్థులు చైనాలోని వివిధ విద్యాలయాల్లో చేరారు. ఇందులో 21 వేల మంది ఎంబీబీఎస్ చదువుతున్నారు. మరోవైపు చైనా విదేశీ విద్యార్థులను తమ దేశంలోకి అనుమతించడం ప్రారంబించింది. అయితే రెండో దశ కొవిడ్ ఉద్ధృతి భారత్‌లో ఎక్కువగా ఉండడంతో.. భారతీయ విద్యార్థులపై మాత్రం ప్రయాణ ఆంక్షలను కొనసాగిస్తోంది. తమను చైనా పంపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని గత నెల 3 వేల మంది విద్యార్థులు ప్రధానమంత్రి మోదీకి విజ్ఞప్తి చేశారు. బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా విద్యార్థుల ఆందోళనను చైనా అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. త్వరలో చైనాలో వింటర్ ఒలింపిక్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ దేశం ప్రయాణ అంక్షలు సడలించనుందన్న వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఈ ఏడాది సెప్టెంబర్- అక్టోబర్ కల్లా భారతీయ విద్యార్థులు తిరిగి చైనాకు వెళ్లే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
అధికారుల తీరుపై జిన్‌పింగ్ అసహనం
ప్రభుత్వ విధాన నిర్ణయాలను అమలుచేయడంలో కొంతమంది అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కార్యాచరణకు దిగకుండా... ప్రతి విషయంలో తన అదేశాల కోసం ఎదురుచూస్తూ కూర్చోవడమేంటని ప్రశ్నించారు. చైనా కమ్యునిస్టు పార్టీ(సీపీసీ)కి చెందిన 'క్రమశిక్షణ పర్యవేక్షణ కమిటీ' ప్లీనరీ సమావేశం ఈ ఏడాది జనవరిలో జరిగింది. ఈ సమావేశంలో జిన్‌పింగ్ అధికారుల తీరుపై పెదవి విరిచారు."“చాలామంది ప్రతి విషయంలోనూ నా సూచనల కోసం ఎదురుచూస్తున్నారు. రాతపూర్వక ఆదేశాలు వస్తే కానీ కార్యాచరణకు దిగట్లేదు. స్వయంగా నేను ఆదేశిస్తేగానీ ఏ పనీ చేయరా? కొంతమంది మాటలు చెబుతున్నారు. చేతలకు మాత్రం దూరంగా ఉంటున్నారు" అని ఆయన అన్నారు. జిన్‌పింగ్ వ్యాఖ్యలను సీపీసీ సెంట్రల్ పార్టీ లిటరేచర్ ప్రెస్ గత నెల్లో ఓ పుస్తకంలో ప్రచురించినట్లు 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' వార్తాసంస్థ ఆదివారం ఓ కథనంలో వెల్లడించింది.
ఇవీ చదవండి:పాక్‌లో కరోనా నాలుగో వేవ్ కలకలం