నేములో ఏముంది? కారు నెంబరులో ఏముంది? అంటే బల్విందర్ సింగ్ సాహ్నీ ఒప్పుకోడు. నెంబరులోనే అంతా ఉంది అంటాడు. అది నా దగ్గరుంటే అన్నీ కలిసొస్తాయి అంటాడు. అందుకే తనకిష్టమైన లక్కీ నెంబర్ కోసం ఏకంగా రూ.60 కోట్లు వెచ్చించాడు. భారత్‌లోనే కాదు.. ప్రపంచంలో చాలా దేశాల్లో రవాణాశాఖలు ప్రత్యేకమైన నెంబర్ల కేటాయింపు కోసం బిడ్డింగ్ వేస్తుంటాయి. వేలం నిర్వహిస్తాయి.
ఫ్యాన్సీ నెంబరు 'డీ5'
దుబాయ్ రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ సైతం ‘డీ5’ అనే ఫ్యాన్సీ నెంబరు కోసం వేలం వేసింది. అక్కడ స్థిరపడ్డ భారతీయ వ్యాపారవేత్త బల్విందర్ ఆ నెంబర్ చేజిక్కించుకోవడానికి రూ.60 కోట్ల భారీ మొత్తం కోట్ చేశాడు. ఇది ప్రపంచంలోనే అత్యధిక రికార్డు.
డీ5 తన అదృష్ట సంఖ్య అనీ.. దాన్ని రోల్స్ రాయిస్ ఫాంటమ్‌కి వాడబోతున్నానని చెప్పాడు బల్విందర్. ఆయన గతంలో మరో ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ.45 కోట్లు ఖర్చు చేశాడు. అతగాడి గ్యారేజీలో ఏకంగా వందకుపైగా కార్లున్నాయి. తొంభయో దశకంలో అరబ్ దేశాల్లోకి వెళ్లి స్థిరాస్తి వ్యాపారం మొదలుపెట్టిన బల్విందర్ ఆర్‌ఎస్‌జీ ఇంటర్నేషనల్ అనే సంస్థకు అధిపతి. అపర కుబేరుడు.