యునెస్కో ఆసియా-పసిఫిక్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అవార్డుల్లో భారత్ నాలుగింటిని కైవసం చేసుకుంది. ముంబయిలోని 155 ఏళ్ల కాలం నాటి 'ఫ్లోరా ఫౌంటెయిన్' తో పాటు దేశ ఆర్థిక రాజధానిలోని కెనెసెథ్ ఎలియాహో ప్రార్థన మందిరం, అవర్ లేడీ ఆఫ్ గ్లోరీ చర్చ్‌లకు ఈ అవార్డులు దక్కాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-అహ్మదాబాద్(ఐఐఎం)లోని విక్రమ్ సారాభాయ్ లైబ్రరీ కూడా ఈ జాబితాలో నిలిచింది.
ఐఐఎం-అహ్మదాబాద్‌లోని విక్రమ్ సారాభాయ్ లైబ్రరీకి 'అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్', కెనెసెథ్ ఎలియాహో ప్రార్థన మందిరం, అవర్ లేడీ ఆఫ్ గ్లోరీ చర్చ్‌లకు 'అవార్డ్ ఆఫ్ మెరిట్', ఫ్లోరా ఫౌంటైన్‌కు 'గౌరవ సూచక అవార్డ్'ను అందించింది యునెస్కో.
ప్రముఖ వాస్తుశిల్పి లూయిస్ఖాన్ రూపకల్పన చేసిన విక్రమ్ సారాభాయ్ లైబ్రరీకి అవార్డును ప్రకటిస్తూ.. " భారత్‌లోని 20వ శతాబ్దానికి చెందిన నిర్మాణాలను పరిరక్షించే దిశగా చారిత్రక విక్రమ్ సారాభాయ్ లైబ్రరీని పునరుద్ధరించడం ముఖ్యమైన ముందడుగు" అని ట్వీట్ చేసింది యునెస్కో. ఫ్లోరా ఫౌంటెయిన్తో పాటు ఇతర విజేతలనూ కొనియాడుతూ ట్వీట్ చేసింది యునెస్కో ఆసియా-పసిఫిక్.
వీటితో పాటు హాంకాంగ్‌లోని చారిత్రక తైకూన్ సెంటర్ ఫర్ హెరిటేజ్ అండ్ ఆర్ట్స్‌ను యునెస్కో అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన 'అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్' వరిచింది. మలేసియాలోని పీనాంగ్లో జరిగిన ఓ కార్యక్రమంలో విజేతలను ప్రకటించింది.