సౌదీ అరేబియాలో 2 రోజుల పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. భారత్-సౌదీ మధ్య సత్సంబంధాలు మరింత మెరుగయ్యే దిశగా వెళ్తున్నాయని తెలిపారు. అమ్మకం-కొనుగోలుదారుస్థాయి నుంచి సన్నిహిత భాగస్వామ్యస్థాయికి వెళ్లేందుకు ఇరుదేశాలు అడుగులేస్తున్నట్లు 'అరబ్ న్యూస్' పత్రికకు ఇచ్చిన ముఖాముఖిలో పేర్కొన్నారు. భారత్లోని చమురు, గ్యాస్ ప్రాజెక్టుల్లో సౌదీ పెట్టుబడులు కూడా ఈ సంబంధాల్లో భాగమేనని వ్యాఖ్యానించారు.
" ప్రపంచ అభివృద్ధికి స్థిరమైన చమురు ధరలు కీలకం. భారతదేశ చమురు అవసరాలు తీర్చడంలో సౌదీ అరేబియా కీలక పాత్ర పోషిస్తోంది. భారత్ పశ్చిమ తీరంలో సౌదీకి చెందిన అరాంకో సంస్థ పెట్రోలియం ప్రాజెక్టులను చేపట్టింది. భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల్లో కూడా ఆ సంస్ధ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తున్నాను."
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
రెండో అతిపెద్ద దేశం
'ఇరాక్ తర్వాత భారత్కు ముడిచమురు సరఫరా చేస్తున్న రెండో అతిపెద్ద దేశం సౌదీ అరేబియా' అని ప్రధాని పేర్కొన్నారు. భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడిచమురులో 18 శాతం వరకు సౌదీ నుంచి వస్తున్నదేనన్న ఆయన.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ 207.3 మిలియన్ టన్నుల ముడిచమురు దిగుమతి చేసుకోగా అందులో 40.33 మిలియన్ టన్నులు సౌదీనే ఎగుమతి చేసిందని స్పష్టం చేశారు.
రెండు రోజుల పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ ఈ తెల్లవారుజామున సౌదీ అరేబియాకు చేరుకున్నారు. రెండు రోజులపాటు సౌదీ అరేబియాలో పర్యటించనున్న మోదీ.. ఉన్నత స్థాయి వార్షిక ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు. అనంతరం గల్ఫ్ రాజ్యాల దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.