ద్వైపాక్షిక ఒప్పందాలను అనుసరించి తమ దేశంలో ఉన్న అణు స్థావరాల వివరాలను భారత్, పాకిస్థాన్ పంచుకున్నాయి. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లో ఈ వివరాలను అధికారికంగా సమర్పించినట్లు పాకిస్థాన్ వెల్లడించింది. భారత విదేశాంగ శాఖ సైతం పాకిస్థాన్ హైకమిషన్‌కు వివరాలు అందించినట్లు స్పష్టం చేసింది.
అణు స్థావరాలపై దాడులకు వ్యతిరేకంగా కుదిరిన 'అటాక్స్ అగైనెస్ట్ న్యూక్లియర్ ఇన్‌స్టాలేషన్స్ అండ్ ఫెసిలిటీస్' ప్రకారం ఈ వివరాలను పంచుకున్నాయి. 1988 డిసెంబర్ 31న ఈ ఒప్పందంపై భారత్, పాకిస్థాన్ సంతకం చేశాయి. ఏటా అణు స్థావరాల సమాచారం అందించుకోవాలని ఇందులోని ఆర్టికల్-2 నిబంధన స్పష్టం చేస్తుంది. ఈ ప్రకారం 1992 జనవరి 1 నుంచి ప్రతి సంవత్సరం ఇరుదేశాలు అణు సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నాయి.
ఖైదీల వివరాలు కూడా
అణు స్థావరాలతో పాటు పాక్‌లో ఉన్న భారతీయ ఖైదీల వివరాలను పాకిస్థాన్ వెల్లడించింది. దీని ప్రకారం ఆ దేశంలో 319 భారతీయులు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 49 మంది సాధారణ పౌరులు, 270 మంది మత్స్యకారులు ఇందులో ఉన్నారు.
అదే సమయంలో భారత్ సైతం పాక్ ఖైదీల వివరాలను ఆ దేశానికి అందించింది. 340 మంది పాకిస్థాన్ వ్యక్తులు భారత్‌లోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. ఇందులో 263 మంది పౌరులు కాగా.. 77 మంది మత్స్యకారులు ఉన్నారు.
2008 మే 21న ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ సమాచార మార్పిడి జరిగింది. ఒప్పందం ప్రకారం రెండుసార్లు(జనవరి 1న, జులై 1న) ఖైదీల వివరాలను ఇచ్చిపుచ్చుకోవాలి.
ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా క్షీణించినప్పటికీ.. ఈ సమాచార మార్పిడి కొనసాగడం విశేషం.
ఇదీ చదవండి: మరో నలుగురికి కరోనా కొత్త స్ట్రెయిన్