కర్తార్‌పుర్ నడవా సాంకేతిక అంశాలపై భారత్-పాకిస్థాన్ అధికారులు సమావేశం నిర్వహించారు. జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల అనంతరం కర్తార్‌పుర్ జీరోపాయింట్ వద్ద మొదటి సారి చర్చలు జరిపారు. భారత్, పాకిస్థాన్‌కు చెందిన 15 మంది ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
భారత్ పంజాబ్‌లోని సిక్కు పవిత్ర క్షేత్రం 'డేరా బాబా నానక్ సాహెబ్', అలాగే పాకిస్థాన్ పంజాబ్‌లోని 'గురుద్వారా దర్బార్ సాహిబ్ కర్తార్‌పుర్' లను ఈ నడవా కలుపుతుంది. ఫలితంగా ఇరుదేశాల సిక్కు భక్తులు తమ పవిత్ర క్షేత్రాలను వీసా లేకుండా దర్శించడానికి మార్గం సుగమమవుతుంది. శ్రమ తగ్గుతుంది.
గతంలోనూ చర్చలు
కర్తార్‌పుర్ నడవాకు సంబంధించి కొన్ని నెలలుగా ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతూ వచ్చాయి. ఈ సమావేశాల్లో ఇరుపక్షాల నిపుణులు అనేక అంశాలపై చర్చించారు.
జులైలోనూ ఈ విషయంపై చర్చించేందుకు ఇరుదేశాల ప్రతినిధులు పాకిస్థాన్‌లోని అత్తారీ-వాఘా సరిహద్దులో సమావేశం నిర్వహించారు.
మొదటి వీసా రహిత ప్రయాణం?
ఒకవైపు పాకిస్థాన్ భారత సరిహద్దు నుంచి దర్బార్ సాహిబ్ వరకు నడవా నిర్మిస్తుండగా, మరోవైపు భారత్ బాబానానక్ నుంచి నడవాను నిర్మిస్తోంది. ఒక వేళ ఈ చర్చలు ఫలించినట్లయితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య మొదటి సారి వీసా రహిత ప్రయాణం అమలు చేసినట్లవుతుంది.
ఇదీ చూడండి:అసోం ఎన్ఆర్సీ తుది జాబితాపై ఆందోళనలు