నేపాల్లోని భారత రాయబార కార్యాలయం మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించనుంది. రెండు దేశాలలోని ఆధ్యాత్మిక, సంస్కృతిక పట్టణాలు అయిన కాఠ్మాండూ, వారణాశిల మధ్య ఈ ర్యాలీ జరగనుంది. 'పశుపతినాథ్- కాశీ విశ్వనాథ్ అమృత్ మహోత్సవ్' పేరుతో దీనిని నిర్వహించనున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్తో సహకారంతో ఈ నెల 11 నుంచి 16 వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
ఈ ర్యాలీలో సుమారు 50 మంది భారతీయ, నేపాల్ పౌరులు పాల్గొననున్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య అనుబంధాన్ని ప్రోత్సహించడం సహా రెండు దేశాల యువకుల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు రాయబార కార్యాలయం పేర్కొంది.
స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా మహాత్మా గాంధీ చంపారన్ సత్యాగ్రహాన్ని ప్రారంభించిన మోతీహరిని కూడా ఈ ర్యాలీలో భాగంగా బైకర్లు సందర్శిస్తారు. అంతేగాకుండా సారనాథ్, గోరఖ్‌నాథ్ మఠం లాంటి వాటిని కూడా సందర్శించనున్నారు. ఈ ర్యాలీ భారత్- నేపాల్ మధ్య ఉండే ద్వైపాక్షిక సంబంధాలు ఎంత బలమైనవనేది నిరూపిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: హైస్పీడ్ రైలులో బోగీకి నిప్పంటించిన దుండగుడు.. చివరకు...