కారిడార్ నిర్మాణ ప్రక్రియపై పది మంది సభ్యులతో కూడిన పీఎస్‌జీపీసీ(పాకిస్థాన్ సిక్కు గురుద్వార ప్రబంధక్ కమిటీ)ని పాక్ ప్రకటించింది. ఇందులో ఖలిస్థాన్ వేర్పాటు వాదులను చేర్చింది.
గతేడాదే ఇరుదేశాల్లోనూ పునాదిరాయి
భారత్ - పాక్ మధ్య ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కర్తార్‌పూర్ కారిడార్ నిర్మాణానికి గతేడాది నవంబర్‌లో ఇరుదేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. నవంబర్ 26న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కలిసి పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో కారిడార్ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. రెండు రోజుల తర్వాత పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కూడా పాక్‌లోని నారోవల్లో శంకుస్థాపన చేశారు.
పూర్తయితే సులభంగా రాకపోకలు
ఈ నిర్మాణం పూర్తయితే మన దేశంలోని పంజాబ్ గురుదాస్‌పూర్ నుంచి పాక్‌లోని కర్తార్‌పూర్‌కు నేరుగా రాకపోకలు సాగించవచ్చు. కర్తార్‌పూర్ సాహిబ్ అనేది పాకిస్థాన్‌లోని రావి నది ఒడ్డున ఉన్న ఓ ప్రముఖ గురుద్వారా. సిక్కుల మతగురువు గురునానక్ జీవితంలోని చివరి క్షణాలను ఇక్కడే గడిపారు. అందుకే సిక్కులు ఈ ప్రాంతాన్ని పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు.
పాక్ స్పందన
ఇరుదేశాల మధ్య ఏప్రిల్ 2న జరగాల్సిన సమావేశాన్ని భారత్ వాయిదా వేయటం విచారకరమని పాకిస్థాన్ దౌత్యవేత్త మహమ్మద్ ఫైజల్ ట్వీట్ చేశారు.
"కర్తార్‌పూర్ కారిడార్‌పై ఏప్రిల్ 2న వాఘా సరిహద్దులో జరగాల్సిన సమావేశాన్ని భారత్ వాయిదా వేయటంపై పాకిస్థాన్ విచారం వ్యక్తం చేస్తోంది. కారిడార్ నిర్మాణంలోని ప్రధాన సమస్యలను గుర్తించి ఏకాభిప్రాయానికి వచ్చే విధంగా చర్చలు జరగాల్సింది.
మార్చి 19న సాంకేతిక అంశాలకు సంబంధించి సమావేశం ప్రయోజనకరంగా జరిగినా... పాకిస్థాన్ అభిప్రాయాలు తెలుసుకోకుండా భారత్ చివరి నిమిషంలో సమావేశాన్ని వాయిదా వేయటం సమంజసం కాదు. "
- మహమ్మద్ ఫైజల్, పాకిస్థాన్ దౌత్యవేత్త