ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా గురువారం శుభాకాంక్షలు తెలిపిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 17న మోదీ పుట్టినరోజు సందర్భంగా నేతలు ఇద్దరూ ఫోన్లో సంభాషించుకున్నట్లు పేర్కొంది విదేశాంగ శాఖ. భారత ప్రధానికి పుతిన్ శుభాకాంక్షలు చెప్పారని.. ప్రతిగా మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారని వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాల్లో పుతిన్ నిబద్ధతపై మోదీ సంతోషం వ్యక్తం చేశారని, భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశాలకు ఆయనను స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలిపారని స్పష్టం చేసింది ఎంఈఏ.
''భారత్-రష్యా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని మోదీ, పుతిన్ పునరుద్ఘాటించారు. కరోనా సంక్లిష్ట పరిస్థితుల్లోనూ ద్వైపాక్షిక సంబంధాలపై నిరంతరం శ్రద్ధ చూపుతున్నందుకు పరస్పరం ప్రశంసించుకున్నారు.''
- భారత విదేశాంగ శాఖ
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్.. రష్యా పర్యటనల గురించీ ఇరువురు నేతలు ఫోన్ కాల్లో ప్రస్తావించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
షాంఘై సహకార సదస్సు(ఎస్సీఓ) కోసం ఇటీవల వేర్వేరుగా రష్యా వెళ్లారు రాజ్‌నాథ్, జైశంకర్. అక్కడి ప్రతినిధులతో విస్తృత చర్చలు జరిపారు. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి ఉత్పత్తి, భారత్‌లో క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి ఇప్పటికే ఇరుదేశాలు సంప్రదింపులు జరిపాయి.
ఇవీ చూడండి: