పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)లో ఎన్నికలను వాయిదా వేసేందుకు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలను సృష్టిస్తోందని స్థానిక మంత్రి చౌద్రీ తారిక్ ఫరూక్ ఆరోపించారు. తొలుత కొవిడ్ మహమ్మారి సాకు చూపించి ఎన్నికల వాయిదాకు పీటీఐ యత్నించి విఫలమైందని, ఇప్పుడు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతోందన్నారు.
కరోనా నేపథ్యంలో పీఓకేలో ఎన్నికలు వాయిదా వేయాలని పాకిస్థాన్ అధికారులు సిఫార్సు చేస్తున్నారు. ఆ దేశ కరోనా పర్యవేక్షణ విభాగం సైతం ఎన్నికలను రెండు నెలల పాటు నిలిపివేయాలని సూచించింది. భారీ సమూహాల వల్ల కరోనా వ్యాపిస్తుందని పేర్కొంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. అయితే స్థానిక విపక్ష పార్టీలు మాత్రం ఎన్నికలు జరిపి తీరాలని పట్టుబడుతున్నాయి.
కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ దేశంలో ఉప ఎన్నికలు జరిపిన విషయాన్ని పీఓకే మంత్రి రాజా ఫరూక్ హైదర్ గుర్తు చేస్తున్నారు. 'పీటీఐ ప్రభుత్వం తను కోరుకున్న ఫలితాలను రాబట్టుకోవాలని అనుకుంటోంది. ప్రధానమంత్రి ఏం చేసినా సరే పీఓకే రాష్ట్రంగా మారదు. వీదేశీ ముప్పు ఉంటే తప్ప పీఓకేలో ఎన్నికలు ఆగవు' అని అన్నారు.
ఇదీ చదవండి- 'మోదీ, జిన్పింగ్లకు ఆ సామర్థ్యం ఉంది'