తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో జూన్ 15న భారత సైన్యంతో జరిగిన ఘర్షణల్లో తమ సైనికులు ఎంత మంది చనిపోయారన్నదానిపై చైనా ఇప్పటి వరకూ నోరు మెదపలేదు. అయితే నాటి పోరులో ఆ దేశ సైనికులు భారత వీర జవాన్ల దెబ్బను గట్టిగానే రుచి చూశారనడానికి అక్కడి సామాజిక మాధ్యమ వేదిక వెయ్‌బోలో హల్‌చల్ చేస్తున్న ఫొటో తొలి సాక్ష్యంగా నిలిచింది. ఇందులో చైనాకు చెందిన చెన్ షియాంగ్రాంగ్ (19) అనే సైనికుడి సమాధి ఉంది. అతడి మృతికి కారణాన్ని వివరిస్తూ మాండరిన్ భాషలో కొన్ని వ్యాక్యాలు రాసి ఉన్నాయి. 'ఫుజియాన్‌లోని పింగ్నాన్‌కు చెందిన 69316 యూనిట్ సైనికుడు చెన్ షియాంగ్రాంగ్ సమాధి ఇది. 2020 జూన్‌లో భారత సరిహద్దు బలగాలతో జరిగిన ఘర్షణలో ప్రాణ త్యాగం చేశాడు. కేంద్ర సైనిక కమిషన్ ఆయనను మరణానంతరం స్మరించుకుంటోంది' అని రాసి ఉంది.
దక్షిణ షిన్‌జియాంగ్ సైనిక ప్రాంతంలో ఆగస్టు 5న ఈ సమాధి శిలను ఏర్పాటు చేసినట్లు కూడా ఫొటో చెబుతోంది. అయితే ఇది నిజమైన చిత్రం కాదని కొందరు నెటిజన్లు వాదించారు. దీనిపై చైనా అధికారులు స్పందించలేదు.
ఇదీ చూడండి:- చైనా సర్కారుపై ఆ దేశ సైనికుల కుటుంబాల ఆగ్రహం