అమెరికాతో ఢీ అంటే ఢీ అంటూ అణ్వాయుధాలను పోగేసుకున్న ఉత్తర కొరియాలో అస్థిరత అవాంఛనీయం. ఇటీవల అనారోగ్య వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కిమ్ జోంగ్ ఉన్‌కు ఏదైనా జరిగితే నాయకత్వ బాధ్యతలు ఎవరు చేపట్టాలన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
1948 నుంచి ఉత్తర కొరియాలో వారసత్వ పాలన సాగుతోంది. కిమ్ జోంగ్ ఉన్‌కు ముగ్గురు పిల్లలు. అధికార బాధ్యతలు చేపట్టేంత వయసు వీరికి లేదు. వీరిలో ఒకరిని భవిష్యత్ నాయకుడిగా ఎన్నుకున్నా.. తాత్కాలికంగా పాలన సాగించే ఒక ప్రతినిధి అవసరమన్న భావన ఉంది.
సోదరే సరైనది!
దీంతో అందరి దృష్టి కిమ్‌జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్‌పై పడింది. ఆమె నేతృత్వంలోని కమిటీ తాత్కాలికంగా పాలన సాగించే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. కిమ్ జోంగ్‌కు కిమ్ జోంగ్ చోల్ అనే సోదరుడు ఉన్నప్పటికీ ఆయన ఎన్నడూ రాజకీయాల్లో పాలుపంచుకోలేదు.
ఉత్తర కొరియాలో గతంలో అధికార ఘర్షణలు జరిగాయి. దేశ ద్రోహం, అవినీతి ఆరోపణలపై తన బంధువు, మార్గదర్శకుడు అయిన జాంగ్ సాంగ్ థేక్‌ను కిమ్ జోంగ్ ఉన్ 2013లో ఉరితీయించారు. తద్వారా అధికారంపై పట్టును పెంచుకున్నారు.
ఇదీ చదవండి: దేశంలో 19 వేలకు చేరువలో కరోనా కేసులు