కరోనా వైరస్ ఎటువంటి పరిస్థితుల్లో జీవించగలదన్న దానిపై అధ్యయనం చేశారు పలువులు పరిశోధకులు. శీతల పరిస్థితుల్లో వేగంగా విజృంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన పరిశోధకులు ఏసీలను ఎక్కువగా వినియోగించవద్దని సూచిస్తున్నారు.
చల్లని ప్రదేశాల్లో శక్తిమంతం అవుతుంది..
కరోనా వైరస్ చల్లని ప్రదేశాల్లో శక్తిమంతం అవుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఐరోపా, అమెరికా ఖండాల్లోని దేశాల్లో ఆ మహమ్మారి అంతలా విరుచుకు పడటానికి శీతల వాతావరణమే కారణమని, ఉష్ణమండల దేశాల్లో ఆ స్థాయిలో వ్యాప్తి లేకపోవడానికి వేడిమి స్థితిగతులు దోహదం చేస్తున్నాయని కొందరు నిపుణులు సూత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35 నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. బయట వేడిగా ఉంది కదా అని ఇళ్లు, వాహనాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏసీలు వాడొద్దు.
పగుళ్లు రానీయొద్దు
ఆరోగ్యవంతమైన చర్మం ద్వారా కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించలేదు. చర్మం పొడిబారి పగుళ్లు ఏర్పడితే వాటి ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఉంటుందని పరిశోధనలు తేల్చాయి. తరచూ చేతుల్ని శానిటైజర్లు, సబ్బుతో శుభ్రం చేసుకోవడం వల్ల కొందరిలో సమస్యలు తలెత్తవచ్చు. అలాంటివారు మాయిశ్చరైజర్లను వినియోగించాలి. ముఖ, శరీర అందం కోసం కొందరు మహిళలు సౌందర్య సాధనాలను వాడుతుంటారు. వాటి వల్ల వేసవిలో ప్రతికూల ప్రభావం ఏర్పడితే వెంటనే ఆపేయడం మంచిది.
రాలి పడుతుంది
పడుకోబోయే ముందు... నిద్ర లేచిన తర్వాత పక్క దుప్పట్లను విదిలిస్తుంటాం. ధరించబోయే ముందు దుస్తుల్ని, తడి తుడుచుకునే ముందు కండువాల్నీ ఇలా చేస్తుంటాం. ఇది ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. విదిలించడం వల్ల వస్త్రాల పోగుల మధ్య ఉన్న కరోనా వైరస్ రాలి కింద పడుతుందని చెబుతున్నారు. దుస్తుల్ని వేడి నీటిలో శుభ్రంగా ఉతికి, ఎండలో ఆరేయడం ప్రయోజనకరం.
గోళ్లు కత్తిరించండి
పొడవుగా పెంచుకున్న గోళ్లను చూసుకుని కొందరు మురిసిపోతూ ఉంటారు. కరోనా విజృంభిస్తున్న వేళ ఈ తీరు ప్రమాదకరం. గోళ్ల సందుల్లో వైరస్ దాగి ఉండి... మనం తాకే వస్తువులకు అంటుకుని కుటుంబ సభ్యులకూ వ్యాపించవచ్చు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ గోళ్లను పెంచవద్దు. పిల్లలు, వృద్ధుల కాళ్లు, చేతుల వేళ్ల గోళ్లను తరచూ పరిశీలిస్తూ... ఎప్పటికప్పుడు కత్తిరిస్తుండాలి.