కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అగ్రరాజ్యం అమెరికాతో పాటు అభివృద్ధి చెందిన దేశాలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. లాక్‌డౌన్ విధించడమే కాకుండా వైరస్ సోకిన వ్యక్తుల్ని గుర్తించేందుకు లక్షల సంఖ్యలో కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేపడుతున్నాయి. ఈ సమయంలో ప్రపంచంలో అధిక వృద్ధ జనాభా కలిగిన జపాన్‌లో.. వైరస్ తీవ్రత స్వల్ప కాలంలోనే అదుపులోకి రావడం ప్రపంచదేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా దేశంలో విధించిన అత్యయికస్థితిని కూడా ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా.. జపాన్ ఏవిధంగా వైరస్‌ను అరికట్టిందనే అంశం అందరిలో ఆసక్తి కలిగిస్తోంది.
దాదాపు 13 కోట్ల జనాభా కలిగిన జపాన్‌లో ఇప్పటిదాకా దాదాపు 17,000 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 825 మంది మృత్యువాతపడ్డారు. ఇక అత్యధిక జనసాంద్రత కలిగిన టోక్యో మహానగరంలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య పదుల సంఖ్యకు పడిపోయింది. అయితే గత నెలలో కాస్త తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో.. అత్యయికస్థితి ప్రకటించినప్పటికీ పూర్తి లాక్‌డౌన్ విధించలేదు. దీంతో క్షౌరశాలలు, రెస్టారెంట్లు కూడా తెరిచే ఉంచారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలను బయట తిరిగేందుకు కూడా అనుమతించారు.
పరీక్షలూ తక్కువే
కొవిడ్-19 నిర్ధరణ పరీక్షలు కూడా ఆశించినంతగా చేయలేదు. కేవలం దేశజనాభాలో 0.2శాతం ప్రజలకు మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా భౌతిక దూరంపై ఉన్న ఆంక్షలను స్వల్పకాలంలోనే సడలించినప్పటికీ వైరస్ వ్యాప్తి మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంది.
కొవిడ్ మరణాల రేటు కూడా స్వల్పంగానే ఉంది. అయితే, అత్యంత సాంకేతికత, మెరుగైన వైద్య సదుపాయాలున్న దేశాల్లోనూ వైరస్ నియంత్రణలోకి రాకుండా రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ సమయంలో జపాన్‌లో తాజా పరిస్థితులు సామాన్యులతో పాటు నిపుణులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వైరస్ తీవ్రత తగ్గడానికి కచ్చితమైన కారణాన్ని గుర్తించనప్పటకీ.. జపాన్ ప్రజల జీవన విధానంతో పాటు ఎన్నో కారకాలు వారికి తోడ్పడినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సాధారణ సమయాల్లోనూ జపాన్ ప్రజలు ధరించే మాస్క్‌లు(మాస్క్ కల్చర్), తక్కువ ఊబకాయం కలిగిన ప్రజలు, వైరస్ బయటపడ్డ తొలినాళ్లలోనే పాఠశాలల మూత వంటి చర్యలు వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో దోహదపడ్డట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటితోపాటు మిగతా భాషలతో పోలిస్తే జపనీయులు మాట్లాడేటప్పుడు తక్కువ నోటి తుంపరులు బయటకు వస్తాయని.. ఇది కూడా వైరస్ వ్యాప్తి నిరోధకంగా పనిచేసి ఉండవచ్చని అక్కడి నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కాంటాక్ట్ ట్రేసింగ్..
జనవరిలో తొలికేసు నమోదైనప్పుడే అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సమయంలో వైరస్ సోకిన వారితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించేందుకు కాంటాక్ట్ ట్రేసర్లను సద్వినియోగపరుచుకుంది. ఇన్‌ఫ్లూయెంజా, క్షయ వంటి వ్యాధుల నియంత్రణ, పర్యవేక్షణ కోసం 2018లో దాదాపు 50వేల మంది వైద్యసిబ్బందిని నియమించుకుంది. వీరిలో దాదాపు సగం మంది శిక్షణ పొందిన నర్సులు ఉన్నారు. వీరందరినీ కరోనా కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఉపయోగించుకొని వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలిగింది. జపాన్‌లో ప్రత్యేకంగా వ్యాధి నియంత్రణ కేంద్రం(సీడీసీ) లేనప్పటికీ దేశంలో ఉన్న మెరుగైన ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ సహాయంతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసినట్లు అక్కడి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
డైమండ్ ప్రిన్సెస్..
చైనా వెలుపల కరోనా వైరస్ వ్యాపిస్తోన్న సమయంలో జపాన్ సమీపంలో ఆగిన డైమండ్ ప్రిన్సెస్ నౌక అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. వారిలో ఒక్కొకరికి వైరస్ బయటపడగా.. జపాన్ అధికారులు అప్రమత్తమయ్యారు. కొన్ని రోజుల పాటు అది అంతర్జాతీయంగా వార్తల్లో నిలవడం అక్కడి ప్రజల్లో కూడా వైరస్ తీవ్రతపై అవగాహన కలిగించిందని కొందరు నిపుణులు భావిస్తున్నారు.
3సీ విధానం..
భౌతిక దూరాన్ని పాటించడంలో జపాన్ ప్రత్యేక విధానాన్ని అనుసరించింది. పూర్తిగా ఒకరికొకరు దూరంగా ఉండకుండా క్లోజ్‌డ్ స్పేసెస్, క్రౌడెడ్ స్పేసెస్, క్లోజ్ కాంటాక్ట్‌లకు మాత్రమే దూరంగా ఉండాలని సూచించింది. ఇవి కూడా భౌతిక దూరంలాగే మెరుగైన ఫలితాలు ఇచ్చాయని అభిప్రాయపడుతున్నారు.
భిన్న వైరస్..
కరోనా వైరస్ తీవ్రత తక్కువగా ఉండడానికి జపనీయులు వారి ఆరోగ్యంపై చూపించే శ్రద్ధ కూడా ఓ కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఇతర దేశాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తున్న కరోనా వైరస్ జాతితో.. పోలిస్తే జపాన్‌లో ఉన్న వైరస్ భిన్నంగా ఉండొచ్చనే వాదన కూడా మొదలైంది. అయితే దీనిపై విస్తృత పరిశోధనలు కొనసాగుతున్నట్లు అక్కడి శాస్త్రవేత్తలు వెల్లడించారు.
అదృష్టమో లేక ప్రభుత్వ ముందస్తు చర్యలతోనో జపాన్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ.. మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మరికొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ రెండవ దఫా విజృంభణ ప్రారంభమైతే మాత్రం అత్యధిక వృద్ధ జనాభా కలిగిన జపాన్ చాలా నష్టపోయే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.