ప్రకృతి సౌందర్యాన్ని ఆకాశంలో విహరిస్తూ చూస్తుంటే... ఆ అనుభూతి వర్ణనాతీతంగా ఉంటుంది. అలా ఆకాశ వీధుల్లోకి తీసుకెళ్లి విహరించేందుకు.. హాట్ ఎయిర్ బెలూన్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ.. అలాంటి వాటిని ఆపరేట్ చేయడానికి శారీరకంగా ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఈ రంగంలో అలాంటి శ్రమ మహిళల వల్ల కాదని పురుషులు మాత్రమే నిలదొక్కుకోగలరనే వాదన ఉంది. ఆ వాదనను కొట్టిపారేస్తూ ఆస్ట్రేలియాకు చెందిన కొంతమంది మహిళలు హాట్ ఎయిర్ బెలూన్ పైలెట్‌లుగా మారారు. అత్యంత కష్టమైన హాట్ ఎయిర్ బెలూన్‌లను ఆవలీలగా ఆపరేట్ చేస్తూ ఆకాశాన్ని చుట్టి వస్తున్నారు.
అన్నింటిని దాటుకుని...
గతంలో తాను హాట్ ఎయిర్ బెలూన్ పైలెట్‌గా మారాలనుకున్నప్పుడు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నానని.. ఆస్ట్రేలియాకు చెందిన బెలూన్ పైలెట్ క్రాఫ్ట్ అంటోంది. అన్నింటిని దాటుకుని తాను ఈ రోజు హాట్ ఎయిర్ బెలూన్ ఆపరేట్ చేస్తున్నానని తెలిసి.. అందరూ ఆశ్చర్య పోతున్నారని ఆమె చెబుతోంది. హాట్ ఎయిర్ బెలూన్‌ను ఆపరేట్ చేయడం ఎంతో శ్రమతో కూడుకున్నదే అయినప్పటికీ.. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని క్రాఫ్ట్ అంటోంది. ఇప్పటికే కమర్షియల్ పైలెట్ లైసెన్స్ కలిగి ఉన్న క్రాఫ్ట్.. తనతో పాటు మరో నలుగురు మహిళలకు ఎయిర్ బెలూన్‌లను ఆపరేట్ చేయడంలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పింది.
"హాట్ ఎయిర్ బెలూన్ రంగంలో ప్రస్తుతం ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతున్నాయి. యువత అధికంగా ఈ రంగంవైపు ఆకర్షితులు అవుతున్నారు. భవిష్యత్తులో ఎక్కువ మంది మహిళలను హాట్ ఎయిర్ బెలూన్ పైలెట్‌లుగా తీర్చిదిద్దుతాను."
-క్రాఫ్ట్, హాట్ ఎయిర్ బెలూన్ ఆపరేటర్.
అయితే.. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు క్రాఫ్ట్ సహా... ఐదుగురు మహిళలు మాత్రమే హాట్ ఎయిర్ బెలూన్ పైలెట్‌లుగా సేవలందిస్తున్నారు.
ఇదీ చూడండి: ఎట్టకేలకు మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ వ్యాపారి అరెస్ట్
ఇదీ చూడండి: మాస్క్ పెట్టుకోమన్నారని.. బ్యాంకు సిబ్బందికి చుక్కలు!