ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమానికి మద్దతిచ్చిన 'ఆపిల్ డైలీ' పత్రిక మూతపడింది. గురువారం చివరి సంచికను వెలువరించనుంది. హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య పోరాటాన్ని, అసమ్మతిని కఠినంగా అణిచివేయాలన్న చైనా వైఖరే ఇందుకు కారణం. ఆ పత్రిక వ్యవస్థాపకుడు జిమ్మీ లాయ్‌తో పాటు, సంపాదకులు, ఉన్నత ఉద్యోగులను అరెస్టు చేయడంతో పాటు, ఆస్తులను స్తంభింపజేయడంతో పత్రిక మూతపడే స్థితికి వచ్చింది. ప్రింట్, ఆన్‌లైన్ ఎడిషన్లను మూసివేయక తప్పడం లేదని బుధవారం యాజమాన్యం ప్రకటించింది. 1995లో లాయ్ దీన్ని స్థాపించారు. తొలుత గాసిప్ వార్తలకు ప్రాధాన్యం ఇచ్చిన ఈ పత్రిక అనంతరం ప్రజాస్వామ్య పోరాటానికి అండగా నిలిచింది. విదేశీ శక్తులతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలపై జాతీయ భద్రత చట్టం కింద చైనా ప్రభుత్వం పలు కేసులు పెట్టింది. చైనా చర్యలను అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్లు ఖండించాయి. స్వేచ్ఛను హరించి, అసమ్మతిని శిక్షించడానికే ఇలాంటి మార్గాన్ని ఎంచుకొందని ఆరోపించాయి.
ఆపిల్ పత్రిక చివరి సంచికను కొనడానికి ప్రజలు పెద్దఎత్తున లైన్లలో నిలిచారు. దాదాపు పది లక్షల కాపీలు అమ్ముడుపోయాయని యాజమాన్యం ప్రకటించింది.
ఇదీ చదవండి: చైనా కక్షసాధింపు- హాంకాంగ్ మీడియా దిగ్గజం అరెస్ట్