ఆ రోజు 1945 సంవత్సరం ఆగస్టు ఆరో తేదీ.. సరిగ్గా ఉదయం 8 గంటల 15 నిమిషాలకు జరిగిందా దాడి. అమెరికా యుద్ధవిమానం 'ఎనోలా గే' జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు లిటిల్‌బాయ్‌ని ప్రయోగించింది. కేవలం 45 సెకన్లలో అంతకుముందు ఎప్పుడూ కనీవినీ ఎరగనంత విస్పోటం చోటుచేసుకుంది. అది పేలగానే ఉష్ణోగ్రత హాఠాత్తుగా 10 లక్షల సెంటీగ్రేడ్‌కు చేరింది. క్షణంలో నగరంలోని కాంక్రీట్ భవనాలు తప్ప భూమిపై వస్తువులన్నీ మాయమైపోయాయి.
1.40 లక్షల మంది బలి..
విస్ఫోటం ధాటికి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని భవనాలు భస్మిపటలంగా మారాయి. అణుబాంబు దాడిలో లక్షా 40 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 90 శాతానికిపైగా హిరోషిమా నగరం ధ్వంసమైంది. ఆ దాడి జరిగిన కొన్ని క్షణాల్లోనే 80 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా ప్రయోగించిన ఆ భయంకర విస్ఫోటాన్ని తట్టుకుని జన్‌బకూ డోమ్ అనే ఒకే ఒక్క భవనం మాత్రమే పాక్షికంగా మిగిలింది. 75 ఏళ్ల క్రితం అలా పాక్షికంగా నిలిచిన భవనమే ఈరోజు హిరోషిమా శాంతి చిహ్నంగా గుర్తింపు పొందింది.
చేదు జ్ఞాపకాలు..
రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ సైన్యం ప్రధాన స్థావరం హిరోషిమా నగరమే. సైన్యానికి ఆయుధాలు సరఫరా చేసే అనేక ఆయుధ డిపోలు ఆ నగరంలో ఉండేవి. అందుకే అమెరికా హిరోషిమాను తుడిచి పెట్టాలని భావించింది. హిరోషిమాపై అణుబాంబు ప్రయోగించింది. ఈ దాడి లక్షల సంఖ్యలో అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకోగా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో ప్రజలను జీవచ్ఛవాలుగా మార్చింది. ఆనాటి చేదు జ్ఞాపకాలను ఇప్పటికీ అక్కడి ప్రజలు మరవలేదు.
"ఉదయం 8 గంటలు అనుకుంటా. మేం అల్పాహారం చేసి కూర్చున్నాము. దూరంగా ఒక ప్రకాశవంతమైన కాంతిని చూశాను. ఆ కాంతి మా డైనింగ్ టేబుల్‌పై కూడా ప్రతిబింబించింది. ఇంటి పైకప్పు కింద పడిపోయింది. కళ్లు మిరిమిట్టు గొలిపే ఆ కాంతిని చూసి భయపడిన మేము ఏమీ మాట్లాడకుండా, అందరం బల్లా కిందకు వెళ్లి దాచుకున్నాము."
-టెట్సుకో షకుడా, హిరోషిమా బాధితురాలు
మియాజుమా రైలు..
హిరోషిమ అణుబాంబు దాడి తర్వాత వెలువడిన రేడియేషన్ అక్కడి ప్రజలపై తీవ్ర ప్రభావమే చూపింది. అయితే బాంబు దాడి జరిగిన కాసేపటికే హిరోషిమా నుంచి మియాజుమా వైపు వెళ్తున్న ఓ రైలు చాలామందిని రేడియేషన్ బారినపడకుండా కాపాడింది.
అమెరికా బాంబుదాడి జరిగిన వెంటనే భయకంపితులైన అనేకమంది ఆ రైలు ఎక్కి ప్రాణాలు అరచేత పెట్టుకుని దూర ప్రాంతానికి వెళ్లిపోయారు. అలా తమ ప్రాణాలు దక్కించుకున్నారు. అణు ప్రమాదం నుంచి వేలాది మందిని రక్షించిన ఆ రైలు ఇప్పుడు కూడా ఆనాటి విషాదానికి మూగ సాక్షిగా నిలిచే ఉంది.
కోలుకుని పారిశ్రామిక నగరంగా..
ప్రపంచంలోనే అత్యంత భారీ విస్పోటాన్ని ఎదుర్కొన్న హిరోషిమా.. ఆ పరిస్థితి నుంచి కోలుకోవడానికి ఏళ్లు పట్టింది. దాదాపు పదేళ్ల తర్వాత జనజీవనం కాస్త కుదుటపడి 1955 నుంచి క్రమంగా కోలుకుంది. ఆ తర్వాత జపాన్ ప్రజల తమదైన శ్రమించే గుణంతో ముందుకు సాగి ప్రస్తుతం పారిశ్రామిక దేశాల్లో ఒకటిగా భాసిల్లుతున్నారు.
ఇదీ చూడండి: హిరోషిమాపై దాడికి 75ఏళ్లు.. మారని ప్రపంచదేశాలు!