చైనాను మంచు దుప్పటి కప్పేసింది. దేశవ్యాప్తంగా శనివారం కురిసిన హిమ వర్షానికి జనజీవనం స్తంభించింది. రాజధాని బీజింగ్ సహా చాలా నగరాల్లో మంచు కారణంగా రహదారులు మూతపడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజువారీ కార్యకలాపాలను సాగించలేకపోయారు. బీజింగ్‌లో పలు చోట్ల 30సెంటిమీటర్ల హిమపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయినందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.
ట్రాఫిక్ జామ్..
మంచుధాటికి చైనాలోని రోడ్లన్ని తెలుపువర్ణాన్ని తలపించాయి. కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన మంచుతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. షాంక్షి రాష్ట్రంలో రహదారులను మొత్తం మూసివేశారు. వాహాయ్ నగరంలో హిమపాతం కారణంగా రోడ్డు ప్రమాదం కూడా జరిగింది.
చైనా-రష్యా సరిహద్దు నగరం హైలాంగ్జియాంగ్లో ఇప్పటికే కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో హిమపాతం కారణంగా ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల అధికారులే కూరగాయలు, నిత్యావసర వస్తువులను ప్రజల ఇళ్లకు సరఫరా చేశారు.
ఇదీ చదవండి: చంద్రుడిపై ఆవాసానికి బాటలు- రోవర్‌తో జలాన్వేషణ!