Ghozali Everyday: సుల్తాన్ గుస్తాఫ్ అల్ ఘొజాలి(22).. ఇండోనేసియా సెమరాంగ్‌లోని ఓ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విద్యార్థి. అతడికి ఓ విచిత్ర అలవాటు ఉంది. అదే.. ప్రతిరోజు ఓ సెల్ఫీ తీసుకోవడం. అందుకోసం ఎమోజీ ఫేస్ పెట్టడం, వింత మేకప్ వేసుకోవడం వంటి కష్టాలేమీ పడడు అతడు. తన కంప్యూటర్ ముందు కూర్చుని, రోజూ ఒకటే ఎక్స్ప్రెషన్తో సెల్ఫీ తీసుకుంటాడు. దాన్ని సేవ్ చేసుకుంటాడు. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదేళ్లుగా చేస్తున్నాడు.
ఒక్క ఐడియా...
ఇలా రోజూ సెల్ఫీలు ఎందుకు తీసుకుంటున్నాడో ఘొజాలికి కూడా తెలియదు. రోజూ అలా జరిగిపోతోంది అంతే. మహా అయితే... గ్రాడ్యుయేషన్ సమయంలో తనలో వచ్చిన మార్పుల్ని తెలిపేలా ఆ సెల్ఫీలు అన్నింటితో కలిపి ఓ టైమ్‌లాప్స్ వీడియో చేద్దామనుకున్నాడు అతడు. ఇంతలోనే 'ఎన్ఎఫ్టీ'లకు సంబంధించిన వార్తలు అతడి దృష్టిని ఆకర్షించాయి.
ఎన్ఎఫ్టీ అంటే.. నాన్ ఫంజిబుల్ టోకెన్. డిజిటల్ దునియాలో ఇప్పుడిదే నయా ట్రెండ్. ట్వీట్లు, పాటలు, ఫొటోలు, వీడియోలు.. ఇలా దాదాపు అన్నింటినీ డిజిటల్ రూపంలో అమ్మేందుకు, కొనేందుకు వినియోగిస్తున్న టెక్నాలజీనే ఎన్ఎఫ్టీ. దీనిద్వారా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ లాంటి వారు ఇప్పటికే కోట్ల రూపాయలు గడించారు.
ఎన్ఎఫ్టీల గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
నా సెల్ఫీలు ఎవరు కొంటారులే...
ఐదేళ్లుగా తీసుకున్న సెల్ఫీలు అన్నింటినీ ఎన్ఎఫ్టీల రూపంలో అమ్మకానికి ఎందుకు పెట్టకూడదు అనుకున్నాడు ఘొజాలి. నిజానికి వాటిని ఎవరైనా కొంటారన్న నమ్మకం అతడికి అసలు లేదు. సరదాగా ప్రయత్నించి చూద్దాం అనుకున్నాడంతే. సంబంధిత వెబ్సైట్లో ఖాతా తెరిచాడు. జనవరి 10న 'ఘొజాలి ఎవిరీడే' పేరుతో 933 సెల్ఫీలు అమ్మకానికి పెట్టాడు. అసలు ఎవరూ కొంటారన్న నమ్మకం లేదు. అందుకే ఒక్కోదాని ధర 3 డాలర్లు మాత్రమేనని పోస్ట్ చేశాడు.
ఆ ఒక్కరి పోస్ట్ వల్ల..
అప్పట్లో దర్శక దిగ్గజం రాజమౌళి 'హృదయ కాలేయం' ట్రైలర్ గురించి చేసిన ట్వీట్‌తో.. తెలుగు రాష్ట్రాల్లో 'బర్నింగ్ స్టార్' అయిపోయాడు సంపూర్ణేశ్ బాబు. ఘొజాలి విషయంలోనూ దాదాపు ఇలానే జరిగింది. ట్వీట్ చేసింది సినీ ప్రముఖులు కాదు. ఓ సెలబ్రిటీ షెఫ్. ఘొజాలి సెల్ఫీని ఎన్ఎఫ్టీగా కొన్నట్లు ఆ వ్యక్తి ట్వీట్ చేశారు. అంతే.. అందరి దృష్టి 'ఘొజాలి ఎవిరీడే' సెల్ఫీల సిరీస్‌పై పడింది. అతడి స్వీయ చిత్రాలు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి.
ఇదీ చూడండి: రూ.కోట్లు కురిపిస్తున్న 'మీమ్స్'- అమ్మేయండిలా...
జనవరి 21కల్లా.. 500 మందికిపైగా ఘొజాలి సెల్ఫీలు కొనుగోలు చేశారు. ఫలితంగా అతడి ఖాతాలో 384 ఎథెర్ కాయిన్స్ వచ్చి చేరాయి. ఎథెర్ అంటే.. బిట్‌కాయిన్ తరహా క్రిప్టోకరెన్సీ. 384 ఎథెర్ల విలువ.. 10 లక్షల డాలర్లకుపైనే. అంటే దాదాపు 7.5 కోట్ల రూపాయలు.
ఇంతకీ ఆ సెల్ఫీలతో ఏం చేస్తున్నారు?
ఎన్ఎఫ్టీ ప్రపంచంలో ఘొజాలి హాట్ టాపిక్ అయ్యాడు. అతడి సెల్ఫీలు కొన్నవారు.. వాటిని టీషర్టులపై ముద్రించి, ధరిస్తున్నారు. మరికొందరైతే అతడి గురించి పాటలు కూడా రాస్తున్నారట.
అలా చేయొద్దు ప్లీజ్..
తన సెల్ఫీలకు ఇంత క్రేజ్ ఎందుకు వచ్చిందో ఇప్పటికీ అర్థం కాలేదని చెబుతున్నాడు ఘొజాలి. వాటిని కొన్నవారికి ఓ ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాడు. దయచేసి తన ఫొటోలను ఎడిట్ చేసి, దుర్వినియోగం చేయొద్దని కోరుతున్నాడు. అలా చేస్తే తన తల్లిదండ్రులు బాధపడతారని అంటున్నాడు.
"ఇలా సెల్ఫీలు అమ్మి, కోట్లు సంపాదించిన విషయం ఇంకా నా తల్లిదండ్రులకు చెప్పలేదు. ప్రస్తుతానికి వారి చెప్పే ధైర్యం లేదు. ఎన్ఎఫ్టీల ద్వారా వచ్చిన సొమ్మును జాగ్రత్తగా మదుపు చేస్తా. ఏదొక రోజు సొంత ఏనిమేషన్ స్టూడియో తెరవాలన్నదే నా కల" అని చెప్పాడు ఘొజాలి.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: దేశంలో ఎన్ఎఫ్టిఫై కార్యకలాపాలు షురూ..!