అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాన్ సైనిక అత్యున్నత కమాండర్ జనరల్ ఖాసీం సులేమానీని హత్య చేశాయి అమెరికా దళాలు. ఈ ఘటన అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దాడులు, ప్రతిదాడులు, ప్రతీకార చర్యలపై ఇరుదేశాలు దృష్టి పెట్టాయి.
భారత్ దారెటు?
ఇరానీ రెవల్యూషనరీ గార్డ్స్‌లోని అల్-ఖుదూస్ దళానికి ఇరవై రెండేళ్ల క్రితం కమాండర్‌గా నియమితులైన జనరల్ సులేమానీ... అసలు తాను హతమవుతానని ఊహించి ఉండరు. తన ప్రత్యర్థులను గ్రహించి వారినుంచి తనను తాను రక్షించుకునేవారు. ఆపరేషన్ డెసర్ట్ స్ట్రోమ్(గల్ఫ్ యుద్ధం)లో ఇరాక్‌ను అమెరికా ఆక్రమించిన తర్వాత కూడా సులేమానీని చంపకపోవడానికి ఆ దేశానికి కారణాలు ఉండొచ్చు. ప్రస్తుతం ఈ హత్య వెనక గల కారణాలు విశ్లేషించడానికి ముందు ఇరాన్‌తో ఆర్థిక సంబంధాలు కలిగి ఉన్న దేశాల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. భారత ద్వైపాక్షిక సంబంధాలలో ఇరాన్ కీలకం కావడం వల్ల ఈ ప్రభావం మన దేశంపై ఏ మేరకు ఉంటుందన్నది ప్రధాన ప్రశ్న.
చాబహర్ రేవు
ఇరాన్ ఆగ్నేయ ప్రాంతంలోని మాక్రన్ తీరంలో ఉండే చాబహర్ ఓడరేవు అభివృద్ధి కోసం భారత్ చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడులు పెడుతోంది. సులేమానీ హత్యపై భారత్ స్పందించే తీరును బట్టి చాబహర్ రేవుపై ప్రభావం ఉంటుందనేది వాస్తవం. ఘటనను భారత్ ఖండించకుండా రెండు దేశాల మధ్య సమతుల్యంగా వ్యవహరిస్తే ఇటు ఇరాన్ గానీ అటు అమెరికా గానీ సంతృప్తి చెందవు. హత్యను ఖండించకుండా మాట్లాడితే అమెరికాకు సానుకూలంగా వ్యవహరించినట్లవుతుంది. అదే సమయంలో ఇరాన్ ప్రతికూలంగా మారుతుంది. ఫలితంగా చాబహర్ రేవులోని షాహిద్ బెహెస్తీ పోర్టును పదేళ్ల పాటు భారత్‌కు లీజుకు ఇచ్చే ఒడంబడిక నుంచి ఇరాన్ వైదొలిగే ప్రమాదం ఉంది.
చైనాను కాదని భారత్‌కు
హర్మూజ్ జలసంధి మార్గంలో రాకపోకలు సహా ముడిచమురు రవాణాకు కీలకమైన చాబహర్ ఓడరేవుపై డ్రాగన్ దేశం చైనా సైతం కన్నేసింది. ఇప్పటికే పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఉన్న గ్వాదర్ పోర్టులో భారీగా పెట్టుబడులు పెట్టింది చైనా. అయితే భారత్‌తో ఉన్న వ్యూహాత్మక సంబంధాల కారణంగా చాబహర్ నిర్మాణాన్ని మనకు అప్పగించడానికే ఇరాన్ మొగ్గుచూపింది. పాకిస్థాన్‌ను పక్కనబెట్టి మధ్య ఆసియాతో రోడ్డు మార్గం సుగమం అయ్యే విధంగా ఇవి భారత్ పెడుతున్న తొలి విదేశీ పెట్టుబడులు కావడం విశేషం.
రష్యా జార్ చక్రవర్తుల కాలం నుంచి కూడా ఈ ప్రాంతంలో ఓడరేవు ఏర్పాటు కోసం తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రాంతం హిందుస్థాన్‌కు ప్రారంభ స్థానం అని అప్పటి ప్రఖ్యాత యాత్రికుడు అల్ బెరునీ తన రచనల్లో పేర్కొన్నారు. ఈ ప్రాంత సందర్శనకు వచ్చిన ఆయన... ఇక్కడి ప్రజలు అనర్గళంగా హిందుస్థానీ మాట్లాడే అంశాల గురించి రచనల్లో ప్రస్తావించారు. మరోవైపు చాబహర్లో భారత్ తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడాన్ని ఇరాన్ దౌత్యవేత్తలు సైతం స్వాగతిస్తున్నారు. పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో భారత్ ఉనికిని వారు కోరుకుంటున్నారు. గూఢచారి ఆరోపణలతో భారతదేశానికి చెందిన కుల్‌భూషణ్ జాదవ్‌ను పాకిస్థాన్ పట్టుకున్నది కూడా చాబహర్ రేవు సమీపంలోనే కావడం గమనార్హం.
ఒప్పందానికి కారణాలు
చాబహర్ ఓడరేవు నిర్మాణంలో రెండు ప్రధాన భాగాలు ఉన్నాయి. ఒకటి పోర్టు నిర్మాణం కాగా రెండోది పోర్టు నుంచి ఇరాన్, అఫ్గానిస్తాన్‌లోని ప్రధాన నగరాలను కలుపుతూ రోడ్డు, రైలు మార్గాలు నిర్మించడం. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు హాసన్ రౌహానీ, అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ 2016లో ఒప్పందం కుదుర్చుకున్నారు. పీ5+1(ఐరాస భద్రత మండలి శాశ్వత సభ్యదేశాలు+జర్మనీ) దేశాలతో అణు ఒప్పందం సహా సులభతర వాణిజ్య రవాణా కోసం అంతర్జాతీయ సముద్ర జలాల ఉపయోగానికి అనుమతి లభిస్తుందన్న అంచనాలతో ఈ ఒప్పందం కుదుర్చుకుంది ఇరాన్. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇరాన్‌తో ఒప్పందం నుంచి వైదొలిగి మళ్లీ ఆంక్షలు విధించారు. దీంతో భారత్ అనుకున్న ప్రాంతాల్లో ఓడరేవులు, రైల్వే వ్యవస్థలను నిర్మించడానికి ఆటంకం కలిగింది.
ఒప్పందంపై ప్రభావం
అయితే అఫ్గానిస్థాన్‌లో చేపడుతున్న పునర్నిర్మాణ చర్యలు సంక్లిష్టంగా మారుతున్నందున చాబహర్ ఓడరేవును అమెరికా మినహాయించింది. భారత్ సమస్య మాత్రం ఇంతటితో తీరిపోలేదు. ఇటీవలే అమెరికా-భారత్ మధ్య జరిగిన 2+2 మంత్రుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 85 మిలియన్ డాలర్ల విలువైన పరికరాల కొనుగోలుకు భారత విదేశాంగ మంత్రి జయ్శంకర్ అమెరికాతో ఒప్పందం చేసుకున్నారు. దీంతోపాటు చాబహర్లో వర్తక సంబంధాలను మెరుగుపర్చడానికి మరిన్ని పోర్టులు నెలకొల్పాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య ఉన్న పరిస్థితుల కారణంగా ఎలాంటి ఒప్పందమైనా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. అమెరికాపై తీవ్రమైన ప్రతీకార చర్య తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమానీ హెచ్చరించిన నేపథ్యంలో సైనిక కమాండర్ సులేమానీ హత్యోదంతంపై భారత్ ఏ విధంగా స్పందిస్తుందనే విషయం ప్రశ్నార్థకంగా మారింది.
అమెరికాతో పనిచేసిన సులేమానీ!
ఇరాన్లో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తుల్లో ఖాసీ సులేమానీ ఒకరు. ఐఎస్ఐఎస్ వంటి స్థావరాలపై విజయాలు సాధించిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. ఒకానొక సమయంలో అమెరికాతో కూడా కలిసి పనిచేశారు. ఇరాక్‌లోని ఇస్లామిక్ స్టేట్ సహా అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్లకు వ్యతిరేకంగా అమెరికా పోరాటానికి మద్దతిచ్చారు. భారత నిఘా సంస్థల మాజీ అధికారులు సైతం సులేమానీతో కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అఫ్గానిస్థాన్ విషయాల్లో అతిగా జోక్యం చేసుకునే వ్యక్తిగా ఆయన్ను అభివర్ణిస్తారు ఈ నిఘా వర్గాలు. చాలా తక్కువగా మాట్లాడే ఆయన.. ఇతరుల నుంచి ఎక్కువ గ్రహించేవారని చెబుతారు.
ట్రంప్ దిల్లీ ప్రస్తావనకు కారణమిదే!
భారత్‌ను సైతం పలుమార్లు సందర్శించారు సులేమానీ. అయితే దిల్లీలో జరిగిన ఉగ్ర కార్యకలాపాల్లోనూ ఆయన హస్తముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. గతంలో ఇజ్రాయెల్ దౌత్యవేత్తపై దిల్లీలో జరిగిన దాడిని ఉద్దేశించే ఇలా అన్నట్లు తెలుస్తోంది. జనరల్ సులేమానీ హత్యను దిల్లీతో ముడిపెట్టడం వల్ల డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు పరోక్ష సందేశం ఇచ్చినట్లు అవగతమవుతోంది. ఎలాంటి అపోహలు, అస్పష్టతలకు గురికాకుండా ఇరాన్‌కు వ్యతిరేకంగా భారత్ అమెరికాకు మద్దతు ఇవ్వాలని ఆ దేశం కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. అధ్యక్షుడు ట్రంప్ సూచనలకు భారత్ కట్టుబడితే చాబహర్ రేవును భారత్ కొనసాగించడం కష్టతరమైన విషయమే. అమెరికా చర్యను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా వ్యతిరేకించడం, ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో తన వైఖరిని స్పష్టం చేయాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం కుడా ఉంది.
(రచయిత- సంజయ్ కపూర్, సీనియర్ పాత్రికేయుడు)