పాకిస్థాన్‌లోని బాలాకోట్ ఉగ్రస్థావరాలపై 2019లో భారత సైన్యం నిర్వహించిన మెరుపు దాడుల్లో 300 ఉగ్రవాదులు మరణించారని పాక్ మాజీ దౌత్యాధికారి జాఫర్ హిలాలీ వెల్లడించారు. పాక్ టీవీ షోలో ఈ విషయాన్ని అంగీకరించారు.
2019లో ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ దుశ్చర్యకు పాల్పడింది తామే అని పాక్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రసంస్థ అంగీకరించింది. అనంతరం పాకిస్థాన్‌లోకి బాలాకోట్‌లో ఫిబ్రవరి 26న మెరుపు దాడులు నిర్వహించింది భారత సైన్యం. జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని సాహసోపేత చర్యకు ఉపక్రమించింది.
అయితే భారత్ మెరుపు దాడిలో ఎవరూ మరణించలేదని అప్పట్లో పాక్ ప్రభుత్వం విషయాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది.
తాజాగా పాక్ మాజీ దౌత్యాధికారి వాస్తవాన్ని అంగీకరించారు. ఆ రోజు భారత్ దాడిలో 300మంది ముష్కరులు మరణించినట్లు ఒప్పుకొన్నారు. ఓ ఉర్దూ ఛానల్ డిబేట్లో ఈ వివరాలు వెల్లడించారు.
" భారత సైన్యం అంతర్జాతీయ సరిహద్దును దాటి యుద్ధ చర్యకు దిగింది. ఆ ఘటనలో కనీసం 300 మంది మరణించినట్లు తెలిసింది. మా లక్ష్యం వారి కంటే భిన్నంగా ఉంది. మేము వారి హైకమాండ్‌ను లక్ష్యంగా చేసుకున్నాము. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగదని అప్పట్లో మేము ఉపచేతనంగా అంగీకరించాము. భారత్ ఎలాంటి చర్యలకు దిగినా ఉద్రిక్తతలు పెంచే పనులు చేయమని చెప్పాము."
-జాఫల్ హిలాలీ, పాక్ మాజీ దౌత్యాధికారి
2019లో పాక్‌తో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఆ దేశ సైన్యానికి భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పట్టుబడ్డారు. అప్పుడు ఒకవేళ ఆయనను విడిచి పెట్టకపోతే భారత్ సైన్యం తమపై దాడి చేస్తుందని పాక్ జాతీయ అసెంబ్లీ సమావేశంలో విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి చెప్పినట్లు 2020 అక్టోబర్‌లో పాకిస్థాన్ ముస్లిం లీగ్ నేత అయాజ్ సాదిక్ వెల్లడించారు. ఆ సమయంలో భారత్ ఎక్కడ దాడి చేస్తుందో అని పాక్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ భజ్వా కాళ్లు గజగజా వణికాయని తెలిపారు. ఇప్పుడు పాక్ దౌత్యాధికారి 300 మంది ఉగ్రవాదులు చనిపోయిన విషయాన్ని బహిర్గతం చేశారు.
మెరుపు దాడుల తర్వాతి రోజు 2019 ఫిబ్రవరి 27న భారత గగనతలంలోకి పాక్ యుద్ధ విమానాలు దూసుకొచ్చాయి. వీటిని అడ్డుకునే క్రమంలో భారత వింగ్ కమాండర్ అభినందన్ యుద్ధ విమానం కూలిపోయింది. పారాచూట్ సాయంతో కిందకు దిగిన ఆయన, దురదృష్టవశాత్తు పాక్ భుభాగంలో పడిపోయి ఆ దేశ సైనికులకు దొరికారు. అనంతరం మార్చి 1న వాఘా సరిహద్దులో అభినందన్‌ను భారత్‌కు అప్పగించింది పాక్.