చైనాలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధం అయ్యాయి. కొండ చరియలు విరిగిపడి భారీగా ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఇంకొన్ని చోట్ల జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. రోడ్లన్నీ బురద ప్రవాహంతో నిండిపోయాయి.
వరుణుడి బీభత్సం ఇలా...
యున్నన్ రాష్ట్రంలోని డెక్విన్ కౌంటీ ప్రాంతంలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లపై రాళ్లురప్పలతో కూడిన చిక్కటి బురదనీరు ఏరులై పారుతోంది.
తూర్పు చైనా జీజియాంగ్ రాష్ట్రంలోని పర్వత ప్రాంత నగరం రుయ్'ఆన్‌లో శనివారం మధ్యాహ్నం అనుకోకుండా భారీ వర్షం కురిసింది. స్థానికులు, పర్యటకులు వరదల్లో చిక్కుకుపోయారు. భద్రతా సిబ్బంది వారిని రక్షించారు.
సిచాన్ రాష్ట్రం గాంగ్వాన్ నగరంలోనూ వరుణుడు ప్రతాపం చూపించాడు. రెండ్రోజుల పాటు కురిసిన వర్షానికి 108వ నెంబర్ జాతీయ రహదారి జలమయమైంది. దాదాపు 500 వాహనాలు కొన్ని గంటల పాటు అలాగే నిలిచిపోయాయి.
షాంగై రాజధాని షియాన్ కూడా వరద ప్రకోపానికి బలైపోయింది. అయితే ఎక్కడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.