అప్గానిస్థాన్(Afghan Taliban) నుంచి ప్రజలను తరలించే ప్రక్రియ పూర్తయినట్లు కెనడా ప్రకటించింది. అమెరికా కంటే ముందే ఇతర దేశాలు కాబుల్‌ను ఖాళీ చేయాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకన్నట్లు తెలిపింది. అఫ్గాన్‌ను(Afghanistan crisis) వీడాలనుకునేవారి కోసం తాము సాధ్యమైనంత సమయం కేటాయించామని పేర్కొంది. మిలిటరీ విమానాల్లో మొత్తం 3,700మందిని తమ దేశానికి తరలించినట్లు కెనడా జనరల్ వేనీ ఐరే వెల్లడించారు.
అఫ్గాన్ నుంచి బ్రిటన్‌కు వెళ్లే అర్హత ఉన్నవారిలో దాదాపు అందరినీ తరలించినట్లు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. కాబుల్ ఎయిర్‌పోర్టు నుంచి తమ వాయుసేన విమానాల ద్వారా 15వేల మందిని తరలించినట్లు వెల్లడించారు. సమయం చాలా తక్కువగా ఉందని, ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే తరలించేందుకు ప్రయత్నిస్తామన్నారు.
కాబుల్ నుంచి ప్రజలను పాకిస్థాన్‌కు తరలించే ప్రక్రియ పూర్తయినట్లు బెల్జియం ప్రకటించింది. వీరందరినీ త్వరలో తమ దేశం తీసుకెళ్తామని చెప్పింది. ఇప్పటి వరకు 1100 మందిని బెల్జియం తీసుకెళ్లినట్లు ఆ దేశ మంత్రి అలెగ్జాండర్ డి క్రూ తెలిపారు.
పోలాండ్ కూడా ప్రజల తరలింపు ప్రక్రియ పూర్తయినట్లు స్పష్టం చేసింది.
ఆగస్టు 31 లోపు తమ ప్రజలందరినీ స్వదేశం తీసుకెళ్లాలని అమెరికాకు తాలిబన్లు డెడ్‌లైన్ పెట్టారు. అగ్రరాజ్యం కంటే రెండు రోజుల ముందే మిగతా దేశాలు తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటున్నాయి. అయితే గురువారం కాబుల్ విమానాశ్రయంలో బాంబుపేలుళ్ల(Kabul Airport blast) అనంతరం భయాందోళనలు మరింత పెరిగాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తరలింపు ప్రక్రియ ఆపబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'వాళ్లను క్షమించం.. ప్రతీకారం తీర్చుకుంటాం'