పాకిస్థాన్‌కు ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ(ఎఫ్ఏటీఎఫ్) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పాక్‌ను గ్రే జాబితాలో కొనసాగిస్తూనే... ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం, మనీలాండరింగ్ వంటి నేరాలను పూర్తిగా నియంత్రించాలని తేల్చిచెప్పింది. కనీసం స్థిరమైన పురోగతి సాధించాలని లేదా బ్లాక్ లిస్ట్‌లో చేర్చడం తప్పదని స్పష్టం చేసింది.
ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ ఐదురోజుల పాటు పారిస్‌లో జరిగింది. ఈ సమావేశంలోనే పాక్‌ను హెచ్చరించింది ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ.
నిర్దేశించిన 27 అంశాల్లో పాకిస్థాన్ కేవలం ఆరు మాత్రమే పూర్తి చేసిందని ఎఫ్ఏటీఎఫ్ సమీక్షలో తేలింది. ఆగ్రహించిన ఎఫ్ఏటీఎఫ్... ఫిబ్రవరి 2020లోగా పాక్‌పై కఠిన చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆర్థిక సంస్థలకు సూచించింది.
2020లో పాకిస్థాన్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చడం ఖాయమని ఎఫ్ఏటీఎఫ్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆర్థికంగా తీవ్రంగా సతమతమవుతున్న పాక్.. ఎఫ్ఏటీఎఫ్ చర్యలతో సంక్షోభంలో కూరుకుపోయే అవకాశముంది.
ఇదీ చూడండి:- పాపాల పాకిస్థాన్‌కు ఎఫ్ఏటీఎఫ్ 'బ్లాక్‌లిస్ట్' ముప్పు!