పాకిస్థాన్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది అంతర్జాతీయ ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ-ఎఫ్ఏటీఎఫ్. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యలపై పాక్ నివేదిక సమర్పించిన నేపథ్యంలో మరింత వివరంగా సమాధానాలివ్వాలని పేర్కొంటూ 150 ప్రశ్నలను పంపించింది. నిషేధిత(ఉగ్రవాద) సంస్థల ఆధ్వరంలోని మదర్సాలపై తీసుకున్న చర్యలను తెలపాలని కోరింది.
జనవరి 8 వరకు గడువు
అక్టోబరులో పారిస్ వేదికగా సమావేశమైంది ఎఫ్ఏటీఎఫ్. అప్పుడే పాకిస్థాన్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చుతారని అంతా భావించినా... కాస్త సడలింపునిస్తూ 2020 ఫిబ్రవరి వరకు గ్రే లిస్ట్‌లో ఉంచింది ఎఫ్ఏటీఎఫ్. పలు కీలకాంశాలపై పాక్‌ను వివరణ కోరింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 6న 22 ప్రశ్నలకు సమాధానమిస్తూ లేఖ పంపించింది పాక్. ఆ జవాబులపై మరింత స్పష్టత కోరుతూ తాజాగా 150 ప్రశ్నలు సంధించింది ఎఫ్ఏటీఎఫ్. వివరణ ఇచ్చేందుకు 2020 జనవరి 8 వరకు గడువు ఇచ్చింది.
ఎఫ్ఏటీఎఫ్ తదుపరి సమావేశాలు 2020 జనవరి 21-24 బీజింగ్ వేదికగా జరగనున్నాయి. అయితే నిర్దేశిత ప్రమాణాలను చేరుకునేందుకు 2020 జూన్ వరకు గడువు పెంచాలని పాక్ కోరనుందని సమాచారం.
ఇదీ చూడండి: 2020 ఫిబ్రవరి వరకు గ్రే లిస్టులోనే పాక్!