ఉగ్రసంస్థలకు నిధులు సమకూరుస్తున్న పాకిస్థాన్‌కు మరోసారి ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ (ఎఫ్ఏటీఎఫ్)లో చుక్కెదురైంది. 2020 ఫిబ్రవరి వరకు గ్రే లిస్టులోనే కొనసాగించాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఉగ్రసంస్థలకు నిధుల అందించడాన్ని పూర్తిగా ఆపివేయడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా పాక్‌ను ఎఫ్ఏటీఎఫ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎఫ్ఏటీఎఫ్లో పాక్ స్థానంపై ఆ సంస్థ 2020 ఫిబ్రవరి కల్లా తుది నిర్ణయం తీసుకోనునే అవకాశం ఉంది.
18న ప్రకటన!
పారిస్‌లో ఈ నెల 13న ప్రారంభమైన ఎఫ్ఏటీఎఫ్ వార్షిక సమావేశాలు ఈనెల 18 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల చివరి రోజైన శుక్రవారం పాక్ అంశంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
బ్లాక్ లిస్టులో చేర్చాలని..
స్తంభింపజేసిన ఖాతాల నుంచి నిధులు ఉపసంహరించుకునేలా ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు పాక్ అనుమతినిచ్చిందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని పేర్కొంటూ పాక్‌ను బ్లాక్‌లిస్టులో ఉంచాలని ఎఫ్ఏటీఎఫ్కు సిఫార్సు చేసింది.
పాక్‌కు కష్టమే..
గతేడాది జూన్‌లో పాక్‌ను 'గ్రే లిస్ట్'లో చేర్చి 2019 అక్టోబర్ నాటికి తమ మార్గదర్శకాలను అమలు చేయాలని సూచించింది ఎఫ్ఏటీఎఫ్. సంస్థ సూచించిన 27 మార్గదర్శకాల్లో కేవలం ఆరింటిని మాత్రమే పూర్తి చేసింది. డార్క్ గ్రే జాబితాపైనా దృష్టి సారించే అవకాశం ఉంది.
గ్రే లిస్టులోనే కొనసాగినా.. డార్క్ గ్రే జాబితాలో చేర్చినా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాక్‌కు మరింత కష్టమవుతుంది. పాక్‌పై ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్, ఐరోపా సమాఖ్యలు ఆర్థిక సహాయం అందించడంపై మరింత కఠిన నిబంధనలు విధించే అవకాశం ఉంది.