మీరు కొత్తగా అంకుర సంస్థ మొదలు పెడుతున్నారా... మీకు అంతగా అవగాహన లేదా... సమగ్ర సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా! అయితే ఇది మీకోసమే.
అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు ఫేస్బుక్ నూతన వేదికకు శ్రీకారం చుట్టింది. కొత్తగా వ్యాపార రంగంలో అడుగుపెట్టే యువపారిశ్రామిక వేత్తల కోసం "ఫేస్బుక్ హబ్స్"ని ఆవిష్కరించింది.
అంకుర సంస్థలు(స్టార్టప్) నెలకొల్పే ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిందే "ఫేస్బుక్ హబ్స్". ఇందులో భాగంగా యువ వ్యాపారవేత్తలకు శిక్షణ, వర్క్‌షాపుల నిర్వహణ, వారి అనుమానాలను నివృత్తి చేస్తారు. దీనికోసం దేశవ్యాప్తంగా 20 ప్రదేశాలను ఎంపిక చేశారు.
దిల్లీ, గురుగ్రామ్, నోయిడా, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్, పూణె, నవీ ముంబయి, గోవాలలో ఫేస్బుక్హబ్ లను నిర్వహిస్తారు. ఏడాది పాటు జరిగే ఈ కార్యక్రమంలో "91 స్ప్రింగ్‌బోర్డ్" సంస్థ సాయంతో శిక్షణనిస్తారు. సంస్థలను సమర్థవంతంగా ఎలా నిర్వహించాలి, నిర్మాణాత్మక పనితీరు, నైపుణ్యాభివృద్ధి లాంటి అంశాలపై తర్ఫీదునిస్తారు.
"ఇప్పటికే మేము వందలాది స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నాం. 91 స్ప్రింగ్బోర్డుతో కలిసి వాటికి మరింత ఊతమిస్తాం. భారత వ్యాపార రంగంలో వీటిని ముందుకు తీసుకెళ్తాం"
-- సత్యజీత్ సింగ్, ఫేస్బుక్ ఇండియా ప్రతినిధి
ఫేస్బుక్ హబ్స్ అనేవి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంకురాల పనితీరుని పర్యవేక్షిస్తాయి. వ్యాపార వేత్తలకు శిక్షణనిచ్చి వారికి మద్దతుగా నిలుస్తాయి.