అఫ్గానిస్థాన్ మొత్తాన్ని తాలిబన్లు తమ గుప్పిట్లో పెట్టుకున్నప్పటికీ.. పంజ్‌షేర్ లోయ(panjshir valley news) చెక్కుచెదరకుండా నిలిచింది. ఘన చరిత్ర, పోరాట యోధుల కథలతో ఇప్పుడు ఈ ప్రాంతం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈసారి ఎలాగైనా పంజ్‌షేర్‌ను తమ వశం చేసుకోవాలని తాలిబన్లు అక్కడ పాగా వేశారు. ఏం జరుగుతుందోనని ప్రజలు పంజ్‌షేర్ సింహాలవైపు చూస్తున్నారు. అయితే.. ఈసారి తాలిబన్ ఫైటర్ల(Taliban news) ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి!
రాజీపడాల్సిందే!
ఇన్నాళ్లు పంజ్‌షేర్ బలగాలను ముందుండి నడిపించిన నేత, పంజ్‌షేర్ సింహంగా పేరున్న అహ్మద్ షా మసూద్ తనయుడు అహ్మద్ మసూద్.. ఇటీవలే ఓ ప్రకటన చేశారు. తాలిబన్లకు తలొగ్గేది లేదని.. వారిని ఎదుర్కొనేందుకు తమ వద్ద ఆయుధాలు ఉన్నాయని తేల్చిచెప్పారు. అయితే.. ఆయన ప్రస్తుతం తాలిబన్లతో రాజీకి సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆయుధాలు ఉన్నా.. ఇతర వనరులు, ముఖ్యంగా ప్రపంచ దేశాల మద్దతు లేకపోవడమే ఇందుకు కారణమని సమాచారం.
"తాలిబన్లతో పంజ్‌షేర్ పోరాడలేదు. తాలిబన్లు తమ సంఖ్యను పెంచుకుంటున్నారు. వారితో పోరాడటానికి ఇది 1980ల నాటి కాలం కాదు. తాలిబన్లు శక్తిమంతులుగా మారారు," అని మసూద్ సలహాదారుడు చెప్పినట్టు ఓ అంతర్జాతీయ వార్తాసంస్థ కథనం ప్రచురించింది. తమకు సహాయం కావాలని ఫ్రాన్స్, ఐరోపా, అమెరికా, అరబ్ దేశాలను అహ్మద్ మసూద్ కోరినప్పటికీ ఫలితం లేదని అయన సలహాదారుడు వెల్లడించారు.
అటు పంజ్‌షీర్ సమీపంలోని మూడు జిల్లాలపై తాలిబన్లు ఇప్పటికే పాగా వేయడం వల్ల అహ్మద్ మసూద్ రాజీ పడతారన్న వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.
ఏంటీ పంజ్‌షేర్...?
హిందూకుష్ పర్వత శ్రేణులకు సమీపంలో కాబుల్‌కు ఉత్తరాన 150 కి.మీల దూరంలో పంజ్‌షేర్ ప్రావిన్స్(panjshir afghanistan) ఉంది. దాదాపు లక్షకు పైగా జనాభా కలిగిన ఈ ప్రాంతంలో తజిక్ జాతికి చెందిన ప్రజలే అత్యధికం. గతంలో తాలిబన్ల పాలనను తుదముట్టించడంలోనూ పంజ్‌షేర్ ప్రాంతానిదే కీలక పాత్ర. అక్కడి ప్రజల్లో ఉన్న ఉద్యమ స్ఫూర్తిని మరింతగా రగిలించి వారిని మార్గదర్శకత్వం చేసిన వారిలో తాలిబన్ వ్యతిరేక నాయకుడు అహ్మద్ షా మసూద్. ఆయన తాలిబన్ల అంతానికి అహర్నిశలు కృషిచేశారు.
అయితే తాలిబన్లు, ఆల్‌ఖైదాలు కలిసి నకిలీ విలేకరుల వేషాల్లో మీడియా ఇంటర్వ్యూ చేస్తూ 2001 సెప్టెంబర్ 9న జరిపిన ఆత్మాహుతి దాడిలో అహ్మద్ షా మసూద్ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆయన తనయుడు అహ్మద్ మసూద్.. తన తండ్రి పోరాట స్ఫూర్తితో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరు సాగిస్తూ వచ్చారు.
ఇదీ చూడండి: Panjshir valley: తాలిబన్లకు పంజ్‌షేర్ నుంచి సింహగర్జన..!