శ్రీలంక- కొలొంబో జైల్లో భారీ ఎత్తున అల్లర్లు చెలరేగాయి. మహారా కారాగారంలో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో ఎనిమిది మంది మృతి చెందారు. ఇద్దరు జైలర్లు సహా.. మొత్తం 37 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు అధికారులు. రిమాండ్లో ఉన్న ఖైదీలు తప్పించుకునేందుకు యత్నించడం వల్లే ఘర్షణ తలెత్తినట్టు సమాచారం. ఈ క్రమంలో అధికారులు వారిని అడ్డుకున్నారు.
ఘర్షణలో భాగంగా వంటగది, రికార్డు గదికి ఖైదీలు నిప్పంటించినట్టు తెలిపారు జైలు అధికారులు. పొరుగువారు సమాచారం ఇవ్వడం వల్ల.. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు.
ఎక్కువ మందిని ఉంచడం వల్లే.!
అయితే.. కరోనా నేపథ్యంలో ఆ కారాగారంలో ఎక్కువ మంది ఖైదీలను ఉంచడమే గొడవకు దారితీసినట్టు తెలుస్తోంది. 10వేల మంది సామర్థ్యం గల జైల్లో సుమారు 26వేల మందిని ఉంచారు.
మహారా జైల్లో ఇప్పటివరకు సుమారు 175 మంది కరోనా బారినపడ్డారు. ఫలితంగా వారిని ఇతర బందీఖానాకు మార్చాలని పలువురు డిమాండ్ చేశారు. ఆ దేశంలోని అన్ని జైళ్లలో కలిపి ఇప్పటివరకు మొత్తం వెయ్యికిపైగా కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. వారిలో గత వారం ఒకరు మరణించగా, మార్చి నెలలో ఒకరు చనిపోయారు.
ఇదీ చూడండి: ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో అట్టుడికిన థాయ్లాండ్