ఉగ్రవాదంపై పోరు కొనసాగించడం సహా ఉగ్రవాద నిధుల సమీకరణపై కఠినంగా వ్యవహరించాలని తూర్పు ఆసియా సదస్సులో కీలక నిర్ణయం తీసుకున్నారు నేతలు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటామని భారత్ సహా కూటమిలోని 18 దేశాలు ఈ మేరకు ప్రతిజ్ఞ చేశాయి.
తూర్పు ఆసియా సదస్సు 14వ సమావేశం ముగింపు సందర్భంగా భద్రతా సవాళ్లు, ఉగ్రవాద ముఠాలను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఓ ప్రకటన విడుదల చేశారు.
ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాలపై పరస్పర సహకారం అందించుకోవడంతో పాటు ఉగ్రవాద వ్యతిరేకంగా పనిచేసే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని డ్రగ్స్ అండ్ క్రైం వంటి అంతర్జాతీయ సంస్థల సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. ఉగ్రవాదులకు నిధులు అందజేయడానికి వ్యతిరేకంగా ఎఫ్ఏటీఎఫ్ రూపొందించిన నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని సంకల్పించాయి సభ్యదేశాలు.
ఉగ్రవాదులకు అంతర్జాలం వంటి అధునాతన సాంకేతికతల ఉపయోగాన్ని నివారించే ఆవశ్యకతను గుర్తించిన సదస్సు...అంతర్జాతీయ నేరాలపై పరస్పర సహకారాన్ని అందించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఆయా దేశాల చట్టాలకు అనుగుణంగా సహకరించుకోవాలని సభ్య దేశాలకు సూచించింది.