కిమ్ యో జోంగ్.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి. గత కొన్నేళ్లుగా ఆ దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ ప్రపంచ దేశల దృష్టిలో పడ్డారు యో. తన నీడను కూడా నమ్మని కిమ్‌కు నమ్మిన బంటుగా అతి తక్కువకాలంలోనే ఇంతటి గుర్తింపు తెచ్చుకున్న యో... అనూహ్యంగా కనుమరుగయ్యారు. ప్రస్తుతం ఆమె ఎక్కడున్నారనే విషయం కూడా ఎవరికీ తెలియదు. మరి ఇందుకు కారణమేంటి? యో ప్రాముఖ్యాన్ని చూసి కిమ్ తట్టుకోలేకపోయారా? తన పీఠానికే ఎసరుపడేడట్టు ఉందని భావించి పక్కనపెట్టారా?
ఎందుకీ మార్పు?
ఈ మధ్య కాలంలో కిమ్ యో జోంగ్కు ప్రాధాన్యం తగ్గిపోతోందని ఉత్తర కొరియా రాజకీయాలను పరిశీలించినవారు చెబుతున్నారు. విధాన వైఫల్యాల వల్ల యోను కిమ్ పక్కనపెట్టారని కొందరు భావిస్తున్నారు. అయితే ఓవైపు తన హయాంలో దేశంలో ఉన్న ఆర్థిక సవాళ్లు.. మరోవైపు రాజకీయంగా యోకు పెరుగుతున్న ప్రాముఖ్యాన్ని చూసి ఆందోళన చెందిన కిమ్.. ఆమెను అధికారానికి దూరంగా ఉంచుతున్నారని అనేక మంది విశ్వసిస్తున్నారు.
ఇప్పటికే కిమ్ 'వారసురాలు' యో అని ఉత్తర కొరియాతో పాటు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో యోకు ఆదరణ పెరిగితే.. తన అధికారం, ఆరోగ్యంపై ప్రజల్లో అనుమానాలు పెరుగుతాయని.. ఫలితంగా ఇది తన పీఠానికే ముప్పు అని కిమ్ అనుకుంటున్నట్టు దక్షిణ కొరియా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే యోను అధికార బాధ్యతల నుంచి తప్పిస్తున్నారని చెబుతున్నారు. ఈ తరుణంలో కిమ్ యో జోంగ్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
ఇదీ చూడండి:- 'మాటలు జాగ్రత్త'- కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
పొలిట్‌బ్యూరోలో లేని పేరు..
ఉత్తర కొరియాలో ఐదేళ్లలో తొలిసారిగా అధికార వర్కర్స్ పార్టీ కాంగ్రెస్‌ను నిర్వహించారు కిమ్. 8 రోజులు సాగిన ఈ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పొలిట్‌బ్యూరో సభ్యుల పేర్లను ప్రకటించారు కిమ్. ఇందులో కిమ్ యో జోంగ్ పేరు లేకపోవడం వల్ల ఈ పూర్తి వ్యవహారంపై అనుమానాలు తారస్థాయికి చేరాయి.
పొలిట్‌బ్యూరో సభ్యులను ఉన్నతస్థాయి అధికారులుగా భావిస్తారు. వీరు కిమ్‌తో అత్యంత సన్నిహితంగా ఉండి పనిచేస్తారు. దేశానికి సంబంధించిన కీలక నిర్ణయాలను ఈ పొలిట్‌బ్యూరో సమావేశాల్లోనే తీసుకుంటారు కిమ్. గతంలో.. ప్రత్యామ్నాయ పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా యో విధులు నిర్వహించారు. ఈసారి పూర్తిస్థాయి కమిటీలో చోటు దక్కుతుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా యో పేరు అటు ప్రత్యామ్నాయ పొలిట్‌బ్యూరో.. ఇటు పూర్తిస్థాయి పొలిట్‌బ్యూరో సభ్యుల జాబితాలో లేదు.
మరోవైపు.. దక్షిణ కొరియాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ బుధవారం ఓ ప్రకటనను విడుదల చేశారు కిమ్ యో జోంగ్. ఈ విషయాన్ని వెల్లడించిన ఉత్తర కొరియా అధికార మీడియా.. చివర్లో ఆమెను "వైస్ డిపార్ట్మెంట్ డైరక్టర్"గా సంబోధించింది. ఇది గతంలో ఆమెకున్న "ఫస్ట్ వైస్ డిపార్ట్మెంట్ డైరక్టర్" బిరుదుకన్నా చాలా తక్కువ కావడం గమనార్హం.
ఇదీ చూడండి:- అధికార పార్టీ ప్రధాన కార్యదర్శిగా కిమ్