Flight Emergency Landing: దిల్లీ నుంచి దోహాకు వెళ్లే విమానాన్ని పాకిస్థాన్‌లోని కరాచీలో సోమవారం అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. ఈ విషయాన్ని పాక్ అధికారులు వెల్లడించారు. కార్గో విభాగం నుంచి పొగలు రావడం వల్ల ఖతార్ ఎయిర్వేస్ విమానం క్యూఆర్-579 కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిందని తెలిపారు.
అయితే అత్యవసర ల్యాండింగ్ జరిగిన కొన్ని గంటల్లోనే అందులోని 283 మంది ప్రయాణికులను మరో విమానంలో దోహా తరలించినట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం తెల్లవారుజామున 3.20కి దిల్లీ నుంచి బయలుదేరిన విమానం.. 5.30 గంటలకు కరాచీలో ల్యాండ్ అయింది.
ఈ ఘటనపై స్పందించిన ఖతార్ ఎయిర్వేస్.. విమానంలో ఈ సమస్య తలెత్తడంపై దర్యాప్తు చేపడుతున్నామని తెలిపింది. ఈ విమానం అత్యవసర ల్యాండింగ్‌తో స్థానికంగా విమాన రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది.
ఇదీ చూడండి : కొండను ఢీకొట్టిన విమానం.. భారీగా ప్రాణనష్టం