చైనాలో కరోనా క్రమక్రమంగా తగ్గుతోంది. వైరస్ ధాటికి బుధవారం 31 మంది మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య వర్గాలు తెలిపాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3 వేలు దాటింది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది హుబే ప్రాంతానికి చెందిన వారని అధికారులు తెలిపారు. తాజాగా మరో 139 మందితో కలిపి కరోనా సోకిన వారి సంఖ్య 80,400కు చేరింది.
దక్షిణ కొరియా...
చైనా తర్వాత దక్షిణ కొరియాలో వైరస్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. దేశంలో కొత్తగా 145 కేసులు నమోదు కాగా.. వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 5,766కు చేరింది. ఇప్పటివరకు 35 మంది మరణించారు. కరోనాను అరికట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అలాగే జపాన్‌లో 1,037, ఇటలీలో 3,089, ఇరాన్లో 2,922, ఫ్రాన్స్‌లో 285 కేసులు నమోదైనట్లు ఆయా దేశాలు ప్రకటించాయి. ఇక్కడ వరుసగా 12, 107, 92, నలుగురు చొప్పున మరణించినట్లు తెలిపాయి. ఆస్ట్రేలియాలో ఇద్దరు మరణించారు.
అమెరికాలో...
అమెరికాలోనూ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇక్కడ 11 మందిని బలితీసుకుంది వైరస్. మొత్తం 131 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మహమ్మారి నియంత్రణ కోసం 8.3 బిలియన్ డాలర్ల కేటాయింపునకు అమెరికా చట్టసభ్యులు ఆమోదం తెలిపారు.
ఇదీ చూడండి:మాస్కుల ఉపయోగంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!