కొవిడ్-19 (కరోనా) వల్ల చైనాలో అంతకంతకూ పెరిగిపోతున్న మరణాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. తాజాగా 142 మంది ప్రాణాలు కోల్పోగా.. ఎక్కువగా హుబే రాష్ట్రంలో బలయ్యారు.
ఇప్పటివరకు వైరస్ కారణంగా 1,665 మంది ప్రాణాలు కోల్పోయారు. 68 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తికి గల కారణాలను అంచనా వేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా 2 వేలకుపైగా కొత్త కేసులు నమోదైనట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ పేర్కొంది. ఒక్క హుబే రాష్ట్రంలోనే 56 వేల 249 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే కొత్తగా కేసులు నమోదు కావడం తగ్గిందని, వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని చైనా అధికారులు వివరించారు.
వైద్యులకూ తప్పని ముప్పు...
వైరస్ బారిన పడి కోలుకొన్న 9,419 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. రోగులకు చికిత్స చేస్తోన్న సమయంలో సుమారు 1700లకు పైగా వైద్య అధికారులకు వైరస్ వ్యాప్తి చెందగా.. వారిలో ఆరుగురు మరణించారు.
వైరస్ వ్యాప్తికి గల కారణాలను పరిశీలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం ఆదివారం చైనా అధికారులను కలవనున్నారు. ఈ నేపథ్యంలో చైనాలో వైరస్ను కట్టడి చేసేందుకు చేపడుతున్న చర్యలను పరిశీలించేందుకు మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు ఆ దేశ ఆరోగ్య కమిషన్ తెలిపింది.