చైనాలో ప్రబలి.. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ భారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 25కు చేరింది. ఈ మేరకు కరోనా వైరస్ కేసుల వివరాలను చైనా జాతీయ వైద్య కమిషన్ వెల్లడించింది. హూబీ రాష్ట్రంలో 24 మంది, ఉత్తర చైనా హుబీలో ఒకరు ఈ వైరస్ వల్ల మృతి చెందినట్లు పేర్కొంది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 830 మంది ప్రజలు వైరస్ భారిన పడినట్లు గుర్తించామని వైద్యాధికారులు తెలిపారు.
కరోనా వైరస్‌కు కేంద్ర బిందువుగా భావిస్తోన్న చైనాలోని వుహాన్ నగరం సహా హుబీ రాష్ట్రంలోని మరో ఐదు నగరాల్లో ప్రజల రాకపోకలను అధికారులు నిషేధించారు. ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లోని ప్రయాణికులకు విస్తృతంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైరస్ వ్యాప్తి దృష్ట్యా... ఉత్తర కొరియా- చైనా దేశానికి మధ్య రాకపోకలను నిషేధించారు.
భారతీయుల కోసం హెల్ప్‌లైన్..
కరోనా వైరస్‌కు సంబంధించి చైనాలోని భారతీయులు, వారి బంధువుల సందేహాలను నివృత్తి చేయటానికి ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది అక్కడి భారత రాయబార కార్యాలయం. చైనాలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. రాయబార కార్యాలయం ద్వారా సమాచారం తెలుసుకోవాలనే వారి కోసం +8618612083629, +8618612083617 హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అమెరికాలో మరో కేసు!
అమెరికాలో ఇప్పటికే ఒక కరోనా వైరస్ కేసు బయటపడింది. అయితే తాజాగా టెక్సాస్‌లో ఈ వైరస్ లక్షణాలున్న వ్యక్తిని వైద్యులు పరీక్షిస్తున్నారు. అనుమానితుడు వైరస్‌కు కేంద్ర బిందువుగా భావిస్తోన్న వుహాన్ నగరం నుంచి ఇటీవల అమెరికాకు వచ్చాడు.
ఇదీ చూడండి: వాతావరణంలో పెనుమార్పులు... భూమాతకు జ్వరం!