ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న కరోనాపై ఓ శుభవార్త చెప్పారు చైనా పరిశోధకులు. నిర్దిష్ట వాహకం ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తున్న ఈ మహమ్మారి.. ఒకవేళ తల్లికి సోకినప్పటికీ.. గర్భంలోని శిశువుకు మాత్రం వ్యాపించదని స్పష్టం చేశారు. వుహాన్‌లో కరోనా సోకిన నలుగురు గర్భిణులపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని మరోమారు ధ్రువీకరించారు. కొవిడ్-19తో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది వైరస్ బారిన పడిన నేపథ్యంలో వైద్య పరిశోధకుల వార్తతో గర్భిణులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
పరిశోధనలు జరిపిన నలుగురు పసికందుల్లో ముగ్గురికి కరోనా నెగటివ్‌గా వచ్చిందని.. ఓ తల్లి మాత్రం తన బిడ్డకు పరీక్షలు జరిపేందుకు నిరాకరించిందని ప్రధాన పరిశోధకులు డాక్టర్ యలన్ లియూ తెలిపారు. ప్రస్తుతం నలుగురు శిశువులతో పాటు వారి తల్లులు కూడా కరోనా నుంచి కోలుకున్నారని వెల్లడించారు.
" నవజాత శిశువుల్లో కరోనా లక్షణాలైన దగ్గు, జ్వరంతో పాటు శ్వాస సంబంధిత సమస్యలేమీ లేవు. అయితే ఒక శిశువు శరీరంపై మాత్రం దద్దుర్లు వచ్చాయి. ఆ తర్వాత క్రమంగా అవే తగ్గిపోయి. ఈ దద్దుర్లు కరోనా వల్ల వచ్చాయా? లేదా ఇంకేమైనా ఆరోగ్య సమస్యలతో వచ్చయా? అన్న విషయం తెలియాల్సి ఉంది."
- డాక్టర్ యలన్ లియూ, ప్రధాన పరిశోధకులు
కరోనా ఇప్పటివరకు 114 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా 1,32,758 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. ఒక్క చైనాలోనే 3,400 మందికి పైగా మృతి చెందారు. ఇటలీ, ఇరాన్‌లోనూ వేలాదిమంది మృత్యువాత పడ్డారు.
ఇది చదవండి: కరోనా దెబ్బకు అమెరికా 14 రోజులు బంద్!