కరోనావైరస్ ధాటికి ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజూ వేలాది కేసులు బయటపడుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 55 లక్షలు దాటిపోయింది. మరణాలు 3.5 లక్షలకు ఎగబాకింది. వైరస్ వ్యాప్తికి అతిపెద్ద బాధిత దేశంగా అవతరించిన అమెరికాలో మరణాల సంఖ్య లక్షకు చేరువైంది. అగ్రరాజ్యంలో కేసులు 16,89,727కి చేరాయి.
అత్యధిక కేసుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న రష్యాలో కరోనా తీవ్ర స్థాయిలో విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో రష్యాలో కొత్తగా 9వేల కరోనా కేసులు బయటపడ్డట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 3.5 లక్షలు దాటినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో మరో 92 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 3,633కి చేరినట్లు స్పష్టం చేశారు.
రష్యాలో మరణాల రేటు అతితక్కువగా ఉండటంపై నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెలువరిస్తున్న గణాంకాల్లో మృతుల సంఖ్యను తక్కువగా చేసి చూపిస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం వీరి వాదనను తోసిపుచ్చుతున్నాయి. వైరస్ కట్టడికి ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్లే మరణాల రేటు తక్కువగా ఉందని చెబుతున్నాయి.
పాక్
పాకిస్థాన్‌లో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 56,349కి చేరింది. కొత్తగా 1,748 మందికి పాజిటివ్‌గా తేలింది. గడిచిన 24 గంటల్లో 34 మంది వైరస్‌కు బలికాగా.. మొత్తం మృతుల సంఖ్య 1,167కి ఎగబాకింది. సింధ్, పంజాబ్ రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో 20 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.
ఒక రోజులో గరిష్ఠం
నేపాల్‌లో మరో 72 వైరస్ కేసులు బయటపడ్డాయి. ఒక్కరోజులో నమోదైన గరిష్ఠ కేసులు ఇవేనని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 675కి చేరినట్లు తెలిపారు.
సింగపూర్ వసతి గృహ కేసులు
సింగపూర్‌లో మరో 344 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో 300 మంది వసతి గృహాల్లో ఉండే విదేశీ కార్మికులే అని వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం నాటికి దేశంలో కేసుల సంఖ్య 31,960కి చేరినట్లు స్పష్టం చేశారు. సోమవారం కరోనా పరీక్షలు తక్కువగా నిర్వహించిన కారణంగానే కేసులు తక్కువగా నమోదై ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరోవైపు వైరస్ కట్టడికి విధించిన ఆంక్షలను జూన్ 2 నుంచి క్రమంగా సడలించే అవకాశం ఉందని సింగపూర్‌కు చెందిన ఓ వార్తా సంస్థ పేర్కొంది. వైరస్ వ్యాప్తి అధికంగా లేని వ్యాపారాలు, ఆర్థిక కార్యకలాపాలకు అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని వెల్లడించింది.
ఆంక్షలను ఎత్తివేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సింగపూర్ మంత్రి లారెన్స్ వాంగ్ సూచించారు. దేశంలో ఇంకా కేసులు దాగి ఉన్నాయని, లక్షణాలు లేని కేసులు సైతం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఒకేసారి లాక్‌డౌన్‌ను సడలించడం మంచిది కాదని పేర్కొన్నారు.
ఎమర్జెన్సీ ఎత్తివేత
వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టడం వల్ల లాక్డౌన్ నిబంధనలను సడలిస్తోంది జపాన్. టోక్యో నగరంపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా భౌతిక దూరంపై ఉన్న ఆంక్షలను కూడా ఈనెల 14నే సడలించింది. ఆ సమయంలో టోక్యోతో పాటు మరో నాలుగు ప్రాంతాలపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించింది.
దేశంలో వైరస్ తీవ్రత తగ్గగా.. దాదాపు నెలన్నర రోజులు కొనసాగిన అత్యయిక స్థితిని ఎత్తివేయడానికి నిర్ణయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జపాన్.. కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా కట్టడి చేయగలిగింది. ఇప్పటి వరకు దేశంలో 17 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 825 మరణాలు సంభవించాయి. అయితే కరోనా కట్టడికి తీసుకున్న కఠిన చర్యల ఫలితంగా దేశం ఆర్థిక మాంద్యంలోకి వెళ్లినట్లు ప్రభుత్వం పేర్కొంది.
70లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ..
ఈ సమయంలో ఆర్థికంగా ఆదుకునేందుకు భారీ ప్యాకేజీ ప్రకటించింది. ఈ అత్యయిక స్థితి ఎత్తివేస్తున్న సమయంలో కొత్త తరహా జీవన విధానంతో ముందుకెళ్తూ.. ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించడం ఎంతో ముఖ్యమని జపాన్ ఆర్థిక మంత్రి యషుతోషి నిషిమురా అన్నారు. దీనిలో భాగంగా 100ట్రిలియన్ యెన్ (దాదాపు రూ.70లక్షల కోట్లు)లతో ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు నిషిమురా పేర్కొన్నారు. గత నెలలో కూడా దాదాపు 117ట్రిలియన్ యెన్‌ల ప్యాకేజీని జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండూ కలిపి జపాన్ జీడీపీలో దాదాపు 40శాతం ఉన్నట్లు అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు.
స్పెయిన్‌లోనూ ఆంక్షల సడలింపు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విదేశీ పర్యటకులను జూలై 1 నుంచి అనుమతించనున్నట్లు తెలిపింది. అయితే ఐరోపా వెలుపలి ప్రయాణికులను అనుమతించే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.