కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారు దీర్ఘకాలం అనారోగ్యం బారినపడే ముప్పు ఉందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ శరీరంలోని అవయవాలపై ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. ఊపరితిత్తులు, గుండె దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొంది. అందుకే కరోనా నుంచి కోలుకున్న రోగులు దీర్ఘకాలం చికిత్స చేయించుకునేందుకు వెసులుబాటు కల్పించేలా ఆరోగ్య బీమా నిబంధనలకు మార్పులు చేసింది చైనా.
ఇక మీదట కరోనా నుంచి కోలుకున్న రోగులు భవిష్యతుల్లో అనారోగ్యానికి గురైతే. వారు ప్రస్తుత ఆరోగ్య బీమా కిందే చికిత్స చేయించుకోవచ్చు. వైద్య ఖర్చులను సంబంధిత ప్రభుత్వ ఆరోగ్య బీమా సంస్థల నుంచి క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.
చైనాలో కరోనా నుంచి కోలుకున్న రోగులు మళ్లీ అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో ఆరోగ్య బీమాకు మార్పులు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. వీరు భవిష్యత్తులో ఊపిరితిత్తులు, గుండె, కండరాలు, మానసిక రుగ్మతల వంటి సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉండటమే ఇందుకు కారణం.
చైనాలో శనివారం వరకు 82,947 కరోనా కేసులు నమోదయ్యాయి. 78,227 మంది వైరస్ బారిన పడి కోలుకున్నారు. 4,634 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం చైనాలో 86 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.