ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరణ కొనసాగుతోంది. కొవిడ్ కేసులు, మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఒక్కరోజులో 1,91,521 మంది వైరస్ బారినపడ్డారు. మరో 4,083 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికాాలపై కరోనా రక్కసి విరుచుకుపడుతోంది.
అమెరికాలో...
కరోనా కేసుల్లో మొదటి స్థానంలో ఉన్న అగ్రరాజ్యంలో.. మరో 40,612 మంది వైరస్ బారినపడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 56,12,027కు పెరిగింది. లక్షా 73 వేల మందికి పైగా మృతి చెందారు. సోమవారం 589 మంది ప్రాణాలు కోల్పోయారు.
బ్రెజిల్లో...
బ్రెజిల్లో కొత్తగా.. 23,038 మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 33 లక్షల 63 వేలు దాటింది. మరో 775 మంది మృతి చెందగా.. మరణాల సంఖ్య 1,08,654కు ఎగబాకింది.
కొలంబియాలో...
కొలంబియాలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. కొత్తగా 8,328 కేసులు బయటపడ్డాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 4,76,660కు చేరింది. మరో 275 మంది వైరస్‌కు బలయ్యారు.
రష్యాలో...
మొదట్లో కరోనా జోరుగా విస్తరించిన రష్యాలో... ప్రస్తుతం కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కొత్తగా 4,892 కేసులు వెలుగుచూశాయి. మొత్తం కేసుల సంఖ్య 9 లక్షల 27 వేలు దాటింది. మరో 55 మంది మృతి చెందడం వల్ల మరణాల సంఖ్య 15,740కు పెరిగింది.
- మెక్సికోలో తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం 5.22 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. మరో 214 మంది మృతి చెందగా.. మొత్తం మరణాలు 56 వేలు దాటింది.
- దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 2,541 కేసులు నమోదయ్యాయి.143 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా మొత్తం బాధితుల సంఖ్య 5 లక్షల 89 వేలు దాటింది. మొత్తం 11,982 మంది ప్రాణాలు విడిచారు.
దేశం | మొత్తం కేసులు | మొత్తం మరణాలు |
అమెరికా | 56,12,027 | 1,73,716 |
బ్రెజిల్ | 33,63,235 | 1,08,654 |
రష్యా | 927,745 | 15,740 |
దక్షిణాఫ్రికా | 589,886 | 11,982 |
మెక్సికో | 522,162 | 56,757 |
ఇదీ చూడండి: ధరాతలంపై మరో ప్రచ్ఛన్నయుద్ధం!