ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ తొలి కేసు డిసెంబర్లో నమోదైందని అందరూ విశ్వసిస్తున్నారు. అయితే ఈ వైరస్ అక్టోబర్ నుంచే చైనాలోని వుహాన్‌లో ఉండే అవకాశముందని తాజాగా ఓ అధ్యయనం పేర్కొంది. ఆ సమయంలో వైరస్ మహమ్మారిగా ఇంకా అభివృద్ధి చెందలేని తెలిపింది.
వైరస్ పుట్టుకపై జరిపిన ఈ అధ్యయనం.. 'ఫ్రాంటియర్స్' అనే జర్నల్‌లో ప్రచురితమైంది. తొలినాళ్లలో ఎలాంటి లక్షణాలు లేకుండా వుహాన్‌లో కరోనా వ్యాపించి ఉండొచ్చని పేర్కొంది.
గబ్బిలాల నుంచి వైరస్ ఏదో ఒక జంతువుకు సోకిందని, అనంతరం మనిషికి 2019 అక్టోబర్-నవంబర్లోనే సంక్రమించి ఉండొచ్చని అధ్యయనంలో పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. వుహాన్‌లోని జీవ, సామాజిక అంశాల వల్ల వైరస్ మహమ్మారిగా మారి ఉండొచ్చని స్పెయిన్‌కు చెందిన పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
ఆ సెలవుల వల్లే...
చైనాలో డిసెంబర్లో వివిధ ఉత్సవాల నేపథ్యంలో ఆహార అమ్మకాలు(సజీవంగా ఉన్న జంతువులతో సహా) భారీగా జరిగాయి. అంతర్జాతీయంగా కూడా ఈ అమ్మకాలు జరిగాయి. ఆ తర్వాత జనవరిలో సెలవులు ఉండటం వల్ల ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేశారు. ఫలితంగా అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న కరోనా వైరస్... ఒక్కసారి బయటకు వచ్చి అలజడులు సృష్టించిందని పరిశోధకులు చెబుతున్నారు.
చైనాలో వైరస్ విజృంభణకు.. అడవి జంతువులకు సంబంధం ఉన్నప్పటికీ.. మహమ్మరి బారినపడిన తొలి వ్యక్తిని గుర్తించడం కష్టమని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే పొలంలో పని చేసే వారికే తొలిసారి ఈ వైరస్ సోకి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుని ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. మున్ముందు కూడా అనేక వ్యాధులు పుట్టుకొస్తాయని హెచ్చరిస్తున్నారు. అందుకు ప్రపంచ దేశాలు ముందు నుంచే సిద్ధంగా ఉండాలన్నారు. సమాజం, ఆర్థిక వ్యవస్థ డీలా పడ్డాక చర్యలు చేపట్టి లాభం లేదని హితవు పలికారు.