2019 డిసెంబర్‌కు ముందే చైనాలోని వుహాన్‌లో కరోనాకి సంబంధించిన ఆనవాళ్లున్నప్పటికీ.. రెండు నెలల వరకు వైరస్‌ను గుర్తించలేదని ఓ అధ్యయనంలో తేలింది. ఈ మేరకు 2019 అక్టోబర్ నాటికి వైరస్‌పై అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా చేసిన పరిశోధనల తాలూకు వ్యాసం ప్రఖ్యాత సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ పరిశోధనల కోసం మాలిక్యులర్ డేటింగ్, ఎపిడెమియోలాజికల్ సిమ్యులేషన్ టూల్స్‌ను ఉపయోగించారు శాస్త్రవేత్తలు. అమెరికా కాలిఫోర్నియాలోని ప్రఖ్యాత శాన్‌డియాగో విశ్వవిద్యాలయం ఈ పరిశోధనలకు నేతృత్వం వహించింది.
సార్స్-కోవ్-2 కీలకం..
కరోనా వైరస్ జాడ కనుగొనడానికి ముందు అసలు సార్స్-కోవ్-2 ఎన్నాళ్ల నుంచి విస్తరిస్తుందో తెలుసుకోవడం ముఖ్యమని పరిశోధనలకు నేతృత్వం వహించిన శాన్‌డియాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ జోల్ ఓ వెర్తీమ్ అన్నారు. ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు వుహాన్‌లో సార్స్-కోవ్-2 ఎలా వ్యాపించింది, వైరస్ జన్యు వైవిధ్యం, తొలిరోజుల్లో (చైనాలో) నమోదైన కేసుల వివరాలను విశ్లేషించినట్లు తెలిపారు.
వివిధ పరిశోధనలు, విశ్లేషణల ఆధారంగా.. చైనాలో సార్స్-కోవ్-2 బారిన పడిన వారి సగటు 2019 నవంబర్ 4 వరకు ఒకటి కంటే తక్కువగానే ఉందని తేల్చారు. 2019 డిసెంబర్ 1 నాటికి కేవలం తొమ్మిది మందే సార్స్-కోవ్-2 బారిన పడ్డారని వివరించారు. ఆ నెల మధ్యలోనే వుహాన్ ఆసుపత్రిలో తొలి కరోనా కేసు గుర్తించినట్లు చెప్పారు.
వైరస్లు, జన్యుసంబంధిత వ్యాధులబారిన పడకుండా మానవాళికి తమ పరిశోధనలు తోడ్పడతాయని వెర్తీమ్ తెలిపారు.
ఇదీ చదవండి: ఆల్ట్రాసౌండ్ ప్రకంపనాలకు కరోనా వైరస్ చిత్తు!