ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. అమెరికా, ఐరోపా దేశాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 37.55 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా ధాటికి 2,59,401 మంది మృత్యువాత పడ్డారు. 12.58 లక్షల మంది కోలుకున్నారు. అమెరికాలో అత్యధికంగా 12.38 లక్షల కేసులు నమోదు కాగా.. 72,293 మంది చనిపోయారు. స్పెయిన్‌లోనూ తాజాగా 3 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.
రష్యాలో కరోనా ప్రకంపనలు
కరోనా వ్యాప్తి నెమ్మదిగా మొదలైన రష్యాలో వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 10,559 కేసులు నమోదయ్యాయి. 86 మంది మృత్యువాత పడ్డారు.
రష్యా వ్యాప్తంగా కరోనా కేసులు 1.65 లక్షలకు చేరుకున్నాయి. 1,537 మంది మరణించారు.
చైనాలో ఆ కేసుల్లో పెరుగుదల..
చైనాలో లక్షణాలు కనిపించని (అసింప్టోమేటిక్) కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 20 కేసులు నమోదు కాగా మొత్తం సంఖ్య 967కి చేరింది. విదేశాల నుంచి వచ్చిన మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలగా మొత్తం కేసుల సంఖ్య 82,883కు పెరిగింది. వీరిలో 339 మంది బాధితులు చికిత్స పొందుతుండగా.. 4,633 మంది మరణించారు.
దక్షిణ కొరియాలోనూ తగ్గుముఖం..
చైనాకు సమీపంలో ఉండే దక్షిణ కొరియాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఈ ద్వీపకల్ప దేశంలో రెండు కేసులు నమోదు కాగా మొత్తం సంఖ్య 10,806కు చేరింది. ఇందులో 1,100 మంది విదేశాల నుంచి వారేనని అక్కడి ప్రభుత్వం తెలిపింది.
ఈ నేపథ్యంలో పాఠశాలలను తెరిచేందుకు కొరియా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. భౌతిక దూరం నిబంధనలను కూడా సడలిస్తున్నారు. అభిమానులు, ప్రేక్షకులు లేకుండానే బేస్‌బాల్ లీగ్‌ను ప్రారంభించింది.
పాక్‌లో ఒక్కరోజే 40 మంది మృతి..
పొరుగుదేశం పాకిస్థాన్‌లో క్రమంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 1,049 కేసులు నమోదు కాగా.. 40 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 22,413కు చేరుకున్నాయి. కరోనా మృతుల సంఖ్య 526కు చేరింది.
పంజాబ్, సింధ్ రాష్ట్రాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉంది. ఒక్కో రాష్ట్రంలో 8 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.