ప్రాణాంతక కరోనా వైరస్.. చైనాలో మృత్యుతాండవం చేస్తోంది. ఇప్పటివరకూ మృతి చెందిన వారి సంఖ్య 304కు పెరిగింది. కొత్తగా మరో 2వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ప్రపంచ దేశాలు మరింత అప్రమత్తమయ్యాయి. చైనా పౌరులకు, చైనా నుంచి వచ్చే వారికి తమ దేశంలో ప్రవేశించకుండా ద్వారాలు మూసేశాయి.
ప్రాణాలు తోడేస్తున్న కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉంది. శనివారం మరో 45 మంది మృతి చెందటం వల్ల ఇప్పటివరకూ వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 304కు పెరిగింది. తాజా మరణాలన్నీ హుబెయ్ ప్రావిన్స్‌లోనే సంభవించాయి. కొత్తగా మరో 2వేలకుపైగా కేసులు నమోదైనట్లు చైనా హెల్త్ కమిషన్ ప్రకటించింది. చైనాలో వైరస్ సోకిన వారి సంఖ్య 14వేల 3వందల 80కి చేరింది. వారిలో 315మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఇంకా 4వేల 5 వందల 16 అనుమానిత కేసులు రికార్డయినట్లు తెలుస్తోంది.
రోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో మరికొన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. చైనా పౌరులకు పర్యాటక వీసాలను రష్యా నిలిపివేసింది. చైనా పౌరులతోపాటు గత రెండు వారాల్లో చైనా సందర్శించిన విదేశీయులు సైతం తమ దేశంలో ప్రవేశించకుండా ఇజ్రాయెల్ ఆంక్షలు విధించింది. పొరుగున్న జోర్దాన్, ఈజిప్ట్ దేశాలకు ఈ నిషేధం వర్తింపజేసింది. చైనా నుంచి తిరిగి వచ్చిన తమ పౌరులు వైరస్ లక్షణాలు లేకున్నా 14 రోజులు నిర్బంధంగా ఇంట్లోనే ఉండాలని సూచించింది. చైనా నుంచి వచ్చే విమానాలపైనా ఆంక్షలు విధించింది.
ఇదీ చదవండి: ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతి