ప్రపంచదేశాలపై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటివరకు మొత్తం 90,938 మంది వైరస్ బారినపడి మరణించగా.. బాధితుల సంఖ్య 16 లక్షలకు చేరువలో ఉంది. ఇటలీ, స్పెయిన్, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది.
881 మంది మృతి..
బ్రిటన్‌లో మరో 881 కరోనా మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 7,978 మంది వైరస్‌కు బలయ్యారు. కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని అధికారులు పేర్కొన్నారు. ఆయన్ను ఐసీయూ నుంచి సాధారణ వార్డ్‌కు తరలించారు. దేశంలో మొత్తం కేసులు 65,077కు చేరాయి.
తగ్గుదల..
స్పెయిన్‌లో కరోనా మృత్యుఘోష గురువారం కాస్త తగ్గింది. దేశంలో వైరస్ కారణంగా నిన్న 683 మంది మరణించారు. బుధవారం చనిపోయిన 757మందితో పోలిస్తే.. ఈ సంఖ్య తక్కువే. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15,238 మంది ప్రాణాలను వైరస్ బలిగొంది. వీటితో పాటు వైరస్ నిర్ధరణ కేసులూ గురువారం తగ్గినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు మొత్తం 1,52,446 మందికి మహమ్మారి సోకినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రజలంతా వైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని ప్రధాని పెడ్రో శాంచైజ్ తెలిపారు.
కేవలం 82 మంది ఇంటెన్సీవ్ కేర్‌లో..
ఫ్రాన్స్‌లో తొలిసారి వైరస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య తగ్గిందని అధికారులు తెలిపారు. అంతకుముందు రోజుతో పోలిస్తే.. గురువారం 82 మందే ఇంటెన్సీవ్ కేర్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం 7,066 మంది రోగులు అత్యవసర చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 12,210కి చేరింది.